టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పీడ్ పెంచారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటినుంచే పని చేస్తున్నారు. ఇందులోభాగంగా రాష్ట్రంలోని టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పార్టీ ఇంచార్జులు, పార్టీ నేతలతో విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. మున్సిపాల్టీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత కొంతకాలం పాటు బాబు సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పంపై దృష్టి పెట్టారు. వాస్తవానికి కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత చంద్రబాబు నియోజకవర్గం మార్చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే గెలుపైనే ఓటమైనా కుప్పంలోనే తేల్చుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు మళ్ళీ కుప్పంలో మూడు రోజులపాటు పర్యటించనున్నారు.

చంద్రబాబుకు ఇప్పటికీ కుప్పం నియోజకవర్గంపై ఆశ పోలేదు. అందుకే కొత్త ఏడాదిన తొలిసారిగా నియోజకవర్గంలో టూర్ పెట్టుకున్నారు. మూడు రోజులపాటూ కార్యకర్తలతో కలిసి ఉండబోతున్నారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలను ప్రజలకు వివరిస్తానని చెబుతున్నారు. నాయకులతో భేటీ అవుతారు, ఓటమికి గల కారణాలను విశ్లేషించుకోవాలని భావిస్తున్నారు. కుప్పంపై పూర్తి స్థాయిలో అంచనాకి రాబోతున్నారు. సమీక్షలు, సమావేశాలు.. నిర్వహించి కార్యకర్తల్లో జోష్ నింపాలని భావిస్తున్నారు. తాజాగా జరిగిన పార్టీ సమావేశంలోనూ చంద్రబాబు కుప్పంలో జరిగిన సంఘటనలను ప్రస్తావించారు. కుప్పం ప్రజలకు తానంటే ఎంతో అభిమానమని, అలాంటి చోట కూడా వైసీపీ అరాచకాలతో గెలిచిందని చెప్పారు. అందుకే వచ్చే ఎన్నికల్లో గట్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. ముందస్తుగా కుప్పంపై ఓ అంచనాకి రాబోతున్నారు చంద్రబాబు.

కుప్పం నియోజకవర్గంలో క్షేత్ర స్థాయి నాయకులను కూడా మార్చేయాలని చంద్రబాబు భావిస్తున్నారని సమాచారం. ఎందుకంటే మున్సిపాల్టీ ఎన్నికల్లో టీడీపీ నేతలు గట్టిగా పోరాడలేకపోయారు. అందుకే టీడీపీ దారుణంగా విఫలమైందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే పని చేయని వారిని పక్కన కూర్చోబెట్టాలని నిర్ణయించారు. వచ్చే ఎన్నికలు ఆషామాషీ ఎన్నికలు కాదని, వైసీపీ రౌడీయిజానికి, అరాచకాలను తట్టుకుని నిలబడే వారికి ప్రస్తుతం ప్రాధాన్యం ఇస్తామని చెబుతున్నారు. మొత్తానికి చంద్రబాబు వ్యూహాలు, ఎత్తుగడలు ఈసారైనా పని చేస్తాయా లేదా అనేది వేచి చూడాలి. బాబు స్పీడ్ చూస్తుంటే మాత్రం అప్పుడే రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినంత హడావుడి కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: