దేశమంతటా ఒమిక్రాన్ కమ్ముకుంటోంది. అన్ని రాష్ట్రాల్లోనూ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. తెలంగాణలోనూ రెండు రోజుల్లోనే కేసులు వందల సంఖ్య నుంచి వేల సంఖ్యలోకి వెళ్లిపోయాయి. అందుకే ఈ ఒమిక్రాన్ ఉధృతి తట్టుకునేందుకు కేసీఆర్ సర్కారు రెడీ అవుతోంది. పెరుగుతున్న కేసులను దృష్టిలో పెట్టుకొని మళ్లీ నిర్ధారణ పరీక్షలను గణనీయంగా పెంచాలని నిర్ణయించింది. ఇప్పుడు రోజుకు సుమారు 40వేల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.


ఇక ఇప్పుడు ఈ పరీక్షలను లక్ష వరకూ పెంచాలని కేసీఆర్ సర్కారు యోచిస్తోంది. అంతే కాదు.. ఇంటి వద్దనే యాంటీజెన్‌ పరీక్షలు చేసుకోడానికి అనుమతిచ్చే ఆలోచన చేస్తోంది. ప్రభుత్వ వైద్యంతో పాటు ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్‌లు, ఇళ్ల వద్ద చేసుకునే పరీక్షలు కలుపుకొని రోజుకు లక్షకు పైగానే నిర్ధారణ పరీక్షలు నిర్వహించే ఆలోచనలో ఉంది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో వస్తున్న కేసుల్లో 50 శాతం వరకూ ఒమిక్రాన్‌ వేరియంట్‌ బాధితులే ఉంటున్నారని ఓ అంచనా ఉంది.


ఈ ఒమిక్రాన్ అతి వేగంతో వ్యాప్తి చెందే గుణం ఉన్న సంగతి తెలిసిందే. అందుకే ముందు ముందు కేసుల సంఖ్య మరింత భారీగా పెరిగే అవకాశాలున్నాయి. అందుకే దీన్ని అరికట్టేందుకు విస్తృతంగా కొవిడ్‌ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. యాంటీజెన్‌ పరీక్షల కిట్లను 2 కోట్ల కొనుగోలుకు ఆదేశాలిచ్చింది. సెకండ్ వేవ్ సమయంలో వైద్యసిబ్బంది ఇంటింటి జ్వర సర్వే నిర్వహించారు. ఆ సమయంలో దాదాపు 8 లక్షల మంది బాధితులకు కిట్లను అందించారు.


ఇక ఇప్పుడూ అలాగే చేయాలని భావిస్తున్నారు. ఇంటింటి జరసర్వే, కిట్లు కొనసాగించాలని వైద్యశాఖ నిర్ణయించింది. దాదాపు కోటి వరకూ హోం ఐసొలేషన్‌ కిట్లను సిద్దం చేయిస్తున్నారు. అలాగే ఒమిక్రాన్ వ్యాప్తిని అరికట్టేందుకు సినిమా హాళ్లలో సగంమంది మాత్రమే కూర్చునేలా ఆదేశాలు జారీ చేసే ఆలోచన కూడా చేస్తున్నారు. దీనిపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: