తెలంగాణలో గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉండ‌డంతో పాటు జాతీయ పార్టీ కావ‌డంతో రాష్ట్రంలో ఆ పార్టీకి బ‌లం చాలానే ఉంది. ఎన్నిక‌ల్లో పెద్ద‌గా ప్ర‌భావం చూప‌క‌పోయిన‌ప్ప‌టికీ అధికార టీఆర్ఎస్ తర్వాత క్యాడర్ పరంగా, నాయకుల పరంగా, కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది. అయితే ఇటీవల రాష్ట్రంలో బీజేపీ బలపడుతోంది. దీనికి కార‌ణం బీజేపీ నాయకత్వం తెలంగాణ పై ఫోకస్ చేయడంతో పాటు కాంగ్రెస్ అధినాయకత్వం తెలంగాణను అంతగా పట్టించుకోక పోవడం మరో కారణం అని అంటున్నారు. కేవలం టీపీసీసీ మార్చి ఇతర నాయకుల‌ను కొత్త పోస్టులు నియమించి చేతులు దులుపుకోవడం మినహా యిస్తే పెద్ద‌గా చేసిందేమీ లేదు. దీంతో పాటు పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నాలు కాంగ్రెస్ అధిష్టానం పెద్దగా చేయడం లేదనే వాదన ఉంది.


 అయితే, మ‌రోవైపు బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ పై ప్రత్యేక శ్రద్ద పెట్టింది. వాస్తవానికి బీజేపీ ఏడాది మొద‌ట్లో జరగాల్సిన ఐదు రాష్ట్రాల ఎన్నికల పై ఇప్పటికే పూర్తి స్థాయిలో దృష్టి సారించి.. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను అనుసరిస్తూ ముందుకు వెళుతోంది. ఆ పార్టీ జాతీయ కార్యవర్గం అంతా ఆ పనిలోనే కొంతకాలంగా మునిగిపోయి ఉంది. ఈ ఎన్నికలు పూర్తయ్యే స‌రికి దక్షిణాదిన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల పైన దృష్టి సారించే అవకాశం ఉన్నట్లు ముందుండి రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నాయి. అయితే ఉన్నట్టుండి కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ జోరు పెంచింది. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలతో పాటు ఇక్కడ కూడా జనంలోకి వెళ్లే ప్రయత్నాలు మొదలుపెట్టింది.


 ఇక తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రత్యక్ష యుద్ధం ప్రకటించిన బీజేపీ దూసుకుపోతోంది. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ‌య్‌ను అరెస్ట్ చేయ‌డం పై  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. రెండు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని బీజేపీని ప్రధాన ప్రతిపక్షంగా ప్రమోట్ చేసుకోవడంలో భాగంగానే ప‌ర‌స్ప‌రం విమ‌ర్శ‌లు చేసుకుంటున్నాయ‌న్నారు. ఇక రాష్ట్రంలో వారి ఆటలు సాగనివ్వం అని ఆయన వ్యాఖ్యానించారు.



ఇక ఉత్తరాదిన ఎన్నికలు ముగిశాక తెలంగాణ, ఏపీ సహా ఇతర రాష్ట్రాల్లోనూ రాహుల్, ప్రియాంక విస్తృతంగా పర్యటించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్న‌ట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసే లక్ష్యంతో బిజెపి ఈ రాష్ట్రాల పైనా కన్నేసిందని కాంగ్రెస్ నాయకుల విశ్లేషిస్తున్నారు. ఇక దేశంతో పాటు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ వెనుక‌ప‌డిపోతుండ‌డంతో పార్టీ అధిష్టానం తెలంగాణ‌లో దృష్టి సారించిన‌ట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆ పార్టీ కీల‌క నేత‌లు అయిన రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాలు తెలంగాణ‌లో ప‌ర్య‌టిస్తార‌ని ఆ పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: