ఊహించిన‌ట్టే కోవిడ్ ముప్పు మూడోసారి ముంగిటికొచ్చి నిలుచుంది. జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే రెండోవేవ్ మాదిరిగానే క‌బ‌ళించేందుకు సిద్ధంగా ఉంది. దేశంలో ఉధృతంగా సాగుతున్న వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ఈ మ‌హ‌మ్మారిని ఎంత‌వ‌ర‌కు అడ్డుకోగ‌ల‌దో. ప్ర‌జ‌ల‌ను ఏమేర‌కు ర‌క్షించ‌గ‌ల‌దో వ‌చ్చే కొద్ది వారాల్లో తేల‌నుంది. దేశవ్యాప్తంగా క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. గ‌డ‌చిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలోనే 90 వేల కేసులు కొత్త‌గా న‌మోద‌య్యాయి. దీంతో క్రియాశీల‌క కేసుల సంఖ్య 3 లక్ష‌ల‌కు చేరుకుంటోంది. ఉధృతికి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వాహ‌కంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 2,630కు చేరుకుంది. ప‌రిస్థితిని స‌మీక్షించేందుకు గాను ప్ర‌ధాని మోదీ శుక్ర‌వారం అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో వ‌ర్ట్యువ‌ల్ మీటింగ్ నిర్వ‌హించ‌నున్నారు. ప‌లువురు, రాజ‌కీయ, సినీ ప్ర‌ముఖులు కూడా కోవిడ్ బారిన‌ప‌డిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత అశోక్ గెహ్లోత్ క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్టు ప్ర‌క‌టించారు. కేంద్ర హోం శాఖ స‌హాయ‌మంత్రి నిత్యానంద్‌రాయ్‌, ఆరోగ్య శాఖ స‌హాయ‌మంత్రి భార‌తీ ప‌వార్‌ల‌కు కోవిడ్ సోకిన‌ట్టు ఇంత‌కుముందే వార్త‌లు వెలువ‌డ్డాయి.
 
తొలివేవ్‌లో కోవిడ్‌ను స‌మ‌ర్థంగా నిలువ‌రించిన కేర‌ళ‌లో రెండోవేవ్ అత‌లాకుత‌లం చేయ‌గా ఇప్పుడు మ‌రోసారి అక్క‌డి ప్ర‌జ‌ల‌ను వ‌ణికిస్తోంది. అక్క‌డ గ‌డిచిన 24 గంట‌ల్లో 4,650 కొత్త కేసులు రాగా 220మందికి పైగా చ‌నిపోయారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఒక్క‌రోజులోనే 15వేల‌కు పైగా కేసులు రాగా ఆరుగురు చ‌నిపోయారు. కోవిడ్ ఉధృతంగా ఉన్న గ‌త ఏడాది మే 8 త‌ర్వాత ఈ స్థాయిలో కేసులు న‌మోద‌వ‌డం ఇదే తొలిసారి. మ‌హారాష్ట్ర‌లోనూ రోజువారీ కేసులు 25వేల‌కు చేరుకోగా వీటిలో 15వేల‌కు పైగా ముంబయి న‌గ‌రంలోనే ఉంటున్నాయి. వెస్ట్ బెంగాల్ ప‌రిస్థితి సైతం దీనికి భిన్నంగాలేదు. ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేసిన త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం చెన్నైలో ఇప్ప‌టికే రాత్రిపూట క‌ర్ఫ్యూ అమ‌లు చేస్తోంది. ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్ విధించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ క‌రోనా క‌ల‌వ‌రం మొద‌లైంది. కేసుల్లో పెరుగుద‌ల వేగంగా ఉంది. హైద‌రాబాద్ నుంచి సంక్రాంతి పండుగ‌కు సొంత ఊర్ల‌కు త‌ర‌లివెళ్లేందుకు ప్ర‌య‌త్నాల్లో ఉన్న ప‌లువురు కోవిడ్ ముప్పు భ‌యంతో సందిగ్దంలో ప‌డ్డారు.  ఏపీలో కొత్త‌గా 547 కేసులు న‌మోదు కావ‌డంతో యాక్టివ్ కేసుల సంఖ్య 2,266 కు చేరుకుంది. ఒక వ్య‌క్తి ప్రాణాలు కోల్పోయాడు. ఉత్త‌రాదిన‌ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం ఇప్ప‌టికే అక్క‌డ స‌భ‌లు, స‌మావేశాలు నిర్వ‌హిస్తుండ‌టంతో, కోవిడ్ ప్ర‌భావం ఇక్క‌డ ఏమేర‌కు ఉండ‌నుందో అన్న ఆందోళ‌న వ్య‌క్త‌మవుతోంది. వీటిని నియంత్రించేందుకు గాను ఇప్ప‌టికే ఆరోగ్య శాఖ ఉన్న‌తాధికారులు ఈసీతో స‌మావేశ‌మై ప‌రిస్థితిని వివ‌రించిన‌ట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: