గ్రేటర్ టిఆర్ఎస్ కు పెద్ద దిక్కు లేకుండా పోయిందా? పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేసే నేతలు లేకపోవడంపై టిఆర్ఎస్ లో జరుగుతున్న చర్చేంటి? గ్రేటర్ లో మంత్రుల పెత్తనాన్ని మెజారిటీ నేతలు సహించలేక పోతున్నారా..? గ్రేటర్ పార్టీకి అధ్యక్షున్ని నియమించాలని కోరుతున్నారా..? ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ టిఆర్ఎస్ అధ్యక్ష పీఠంపై కన్నేసిన నేతలెవరు?  గ్రేటర్ హైదరాబాద్ టిఆర్ఎస్ కు చాలా కాలంగా పెద్ద దిక్కు లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కారుల లో గులాబీ పార్టీ గ్రేటర్ అధ్యక్షునిగా ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు చాలాకాలం పాటు పనిచేశారు.

 అప్పుడు హైదరాబాదులో పెద్దగా పార్టీ ప్రభావం లేకున్నా పద్మారావు ఉన్నంతవరకు క్రియాశీలక పాత్ర పోషించారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత యువ నాయకుడు కట్టెల శ్రీనివాస్ కు గ్రేటర్ అధ్యక్ష పదవి కట్టబెట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కట్టెల టిఆర్ఎస్ ను వీడడంతో ఆ పదవిని టిడిపి నుంచి వచ్చిన మైనంపల్లి హనుమంతరావు అప్పగించారు. ఇక మైనంపల్లి హనుమంతరావు గ్రేటర్ అధ్యక్ష పదవీకాలం ముగిసి చాలా కాలమైంది. అప్పటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ పార్టీని నడిపించే నాయకుడు లేకుండా పోయాడు. దీంతో గ్రేటర్ పార్టీలో సమన్వయం కొరవడిందనే చర్చ గులాబీ పార్టీ లో జరుగుతోంది. ఇక కేసీఆర్, కేటీఆర్ లు ప్రగతి భవన్ కే ఎక్కువ సమయం కేటాయిస్తూ పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండటం లేదని గుసగుసలు తెలంగాణ భవన్ లో వినిపిస్తున్నాయి. గ్రేటర్ పరిధిలోని మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి లు పార్టీ నేతలపై పెత్తనం చేలాయిస్తున్నారని గులాబీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గ్రేటర్ పార్టీకి అధ్యక్షుడిని నియమిస్తే కార్యక్రమాల సమన్వయం చేయడం ఈజీ అవుతుందన్న అభిప్రాయాన్ని మెజారిటీ కార్పొరేటర్లు,ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.త్వరలో పార్టీలో పదవులను భర్తీ చేయాలని అధిష్టానం ఆలోచిస్తోంది. దీంతో ఈ కీలకమైన పదవిపై చాలా మంది నేతలు కన్నేశారు. ముఖ్యంగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

కెసిఆర్,కేటీఆర్ లకు రామ్మోహన్ అత్యంత సన్నిహితుడు కావడం ఆయనకు కలిసొచ్చే అంశం. మంత్రి తలసాని యాదవ్ కుమారుడు సాయి కిరణ్ కూడా గ్రేటర్ అధ్యక్ష పీఠంపై ఫోకస్ పెట్టాడు. మరోవైపు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి కూడా సీరియస్ గా వర్కౌట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో మంత్రి మల్లారెడ్డి సైతం తన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ని తెరపైకి తెస్తున్నారట. మొత్తానికి గ్రేటర్ అధ్యక్ష పదవి విషయంలో కెసిఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న చర్చ పార్టీలో ఉత్కంఠ రేపుతోంది. రాష్ట్ర పార్టీలో అత్యంత కీలకమైన పదవి కోసం జరుగుతున్న పోటీలో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: