ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. కేసుల వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ వేరియంట్ ప్రమాదకరం కాదన్న ఊహాగానాలు కొట్టి పారేసింది. ఒమిక్రాన్ కూడా డేంజరేనని.. ఈ వేరియంట్ సోకిన వాళ్లు ఎక్కువగా ఆస్పత్రిలో చేరుతున్నారని తెలిపింది. వారం వ్యవధిలో 71శాతం కేసులు పెరిగాయని తెలిపింది. ఇదే చివరి వేరియంట్ అని చెప్పలేమని .. జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేసింది.

మరోవైపు కరోనా వైరస్ సోకిన వారు వారం రోజుల్లోపే కోలుకుంటున్నప్పటికీ.. క్వారంటైన్ సమయాన్ని 14రోజుల పాటు ఉంచడమే మేలని డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు చేసింది. పరిస్థితిని బట్టి ఈ క్వారంటైన్ పరిమితి ఎన్ని రోజులు ఉండాలనే నిర్ణయం ఆయా దేశాలే తీసుకోవాలని డబ్ల్యూహెచ్ ఓ నిపుణుడు డాక్టర్ అబ్దీ మహమూద్ అన్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల్లో గణనీయమైన పెరుగుదల ప్రజల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఒమిక్రాన్ బారిన పడి 108మంది ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రపంచ దేశాల్లో 4లక్షల 70వేల 462 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు పేర్కొంది. యూకేలో అత్యధికంగా 2లక్షల 46వేల 780 ఒమిక్రాన్ కేసులు నమోదవ్వగా.. డెన్మార్క్ లో 57వేల 125, అమెరికాలో 42వేల 539, జర్మనీలో 35వేల 529చొప్పున కొత్త వేరియంట్ కేసులు నమోదైనట్టు వివరించింది. అయితే దేశంలో ప్రస్తుతం 2వేల 135 ఒమిక్రాన్ కేసులున్నట్టు తెలిపింది.

ఇక భారత్ లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ మరణాలు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. అయితే దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. రాజస్థాన్ లో ఒమిక్రాన్ సోకిన 72ఏళ్ల వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇటీవల మహారాష్ట్రలో ఓ బాధితుడు ఒమిక్రాన్ కారణంగా మృతి చెందినట్టు వార్తలు రాగా.. అది ఒమిక్రాన్ మరణం కాదని తేలింది.














మరింత సమాచారం తెలుసుకోండి: