తెలంగాణ కాంగ్రెస్ లో ఆయన ఒక ఫైర్ బ్రాండ్. నల్లగొండ జిల్లా రాజకీయాలను శాసించే వారిలో కీలక నేత.విద్యార్థి దశ నుండే పార్టీలో కీలకంగా ఎదిగిన వ్యక్తి. పిసిసి అధ్యక్ష పదవి మీద ఆశలు పెట్టుకున్నారు. పదవి రాకపోవడంతో, గాంధీభవన్ మెట్లు  ఎక్కనంటూ శపథం చేశారు. ఇప్పుడు ఆ నేత తన మనసు మార్చుకున్నారా? మళ్లీ కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషించబోతున్నారా?  ఇంతకీ ఎవరా నేత?  ఉత్తమ్ కుమార్ తర్వాత తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి కోసం చాలా మంది పోటీపడ్డారు. గాంధీభవన్ బాస్ ను ఎంపిక చేయడంలో కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర కసరత్తే చేసింది.

 అనేకనేక చర్చోపచర్చల తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరును ప్రకటించారు. రేవంత్ పీసీసీ చీఫ్ కావడాన్ని  ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. అధిష్టానం మీద తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ యాభై కోట్లకు పిసిసి చీఫ్ పదవిని అమ్ముకున్నాడని బహిరంగంగానే కామెంట్ చేశారు. ఇక జీవితంలో గాంధీభవన్ మెట్లు ఎక్కనని, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గోనబోనని శపథం చేశారు. దీంతో పార్టీలో గ్రూపు రాజకీయాలు తీవ్రమయ్యాయి. గాంధీభవన్ కోమటిరెడ్డి,రేవంత్ రెడ్డి సీనియర్ల వర్గాలుగా చీలిపోయింది. హఠాత్తుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గాంధీభవన్ లో వాలిపోయారు. అక్కడ అప్పటికే ధరణి పోర్టల్ మీద నడుస్తున్న సమావేశంలో సీనియర్లెవరు మాట్లాడకుండానే మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఒక్కసారిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గాంధీభవన్ లోకి ఎంట్రీ ఇవ్వడం తో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఓ కుటుంబం ఆత్మహత్యకు కారణమైన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారున్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తన పార్లమెంటరీ నియోజకవర్గంలో ఫార్మాసిటీ భూములపై తాడోపేడో తేల్చుకుంటామని ప్రభుత్వానికి సవాళ్లు విసిరారు. కెసిఆర్ నే నడ్డా ఎటిఎం అంటున్నారని తాను ఎప్పుడో చెప్పానన్నారు.

 రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై ప్రధానిని కలిసి ఆధారాలు సమర్పిస్తానని చెప్పారుకోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అవినీతిలో తెలంగాణ ప్రభుత్వం నెంబర్ వన్ స్థానంలో ఉందని ఆయన అన్నారు. మంగళవారం జరిగిన టీ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ చేసిన వ్యాఖ్యలు సీనియర్లకు కొత్త ఉత్సాహాన్ని నింపాయని అంటున్నారు. ఆ ప్రభావంతోనే గాంధీ భవన్ సీనియర్ నేతలతో కలకలలాడినట్లు కనిపిస్తోంది. ఇకపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నియోజకవర్గ సమస్యలతోపాటు కాంగ్రెస్ కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొంటారని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: