కిమిడి కళా వెంకట్రావు... తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడి పిలుపు మేరకు పార్టీలో చేరారు. 1983 నుంచి శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. 1983, 1985, 1989, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని ఉణుకూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక అదే సమయంలో మునిసిపల్, వాణిజ్య పన్నులు, హోమ్ శాఖ వంటి కీలక శాఖలను మంత్రిగా సమర్థవంతంగా నిర్వహించారు కిమిడి కళా వెంకట్రావు. ఇక పార్టీ అధినేత సూచన మేరకు 1998 నుంచి 2004 వరకు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్‌గా కూడా వ్యవహరించారు కళా వెంకట్రావు. 2009 ఎన్నికల సమయంలో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. నియోజకవర్గాల పునర్విభజన కారణంగా ఉణుకూరు నియోజకవర్గం రద్దయ్యింది. అలాగే రాజాం నియోజకవర్గం ఎస్సీగా రిజర్వ్ అయ్యింది. దీంతో ఎచ్చెర్ల నుంచి పోటీ చేశారు కళా వెంకట్రావు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. అయితే.. ప్రజారాజ్యం పార్టీ నుంచి బయటకు వచ్చిన కళా వెంకట్రావు... తిరిగి సొంత గూటికి చేరుకున్నారు.

2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కిమిడి కళా వెంకట్రావు... దాదాపు 7 వేల ఓట్ల మెజారిటీ సాధించారు. పార్టీలో సీనియర్ నేత కావడంతో... కళా వెంకట్రావుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అదే సమయంలో... రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రిగా కూడా వ్యవహరించారు కిమిడి కళా వెంకట్రావు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో కళా వెంకట్రావు ఓడారు. నాటి నుంచి ఎచ్చెర్ల నియోజకవర్గం నేతల్లో నిత్యం సమీక్షలు చేస్తున్నారు కళా వెంకట్రావు. అయితే... ప్రస్తుతం ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు కూడా. ఇదే సమయంలో ఎచ్చర్ల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసేందుకు మరో నేత కూడా రెడీ అయ్యారు. కలిశెట్టి అప్పలనాయుడు కూడా ఇప్పటికే.. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రణస్థలం, లావేరు మండలాల్లో ఇప్పటికే పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. రాబోయే రోజుల్లో కళా వెంకట్రావు భవిష్యత్తు ఎలా ఉంటుందో మరి వేచి చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: