ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులను ఎన్నో రోజుల నుంచి ఊరించిన పీఆర్‌సీ ప్రకటన చివరకు వారిని నిరాశ పరిచింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో.. అదికూడా 2014వ సంవత్సరంలో రాష్ట్ర విభజన జరిగిన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్ధిక లోటుతో రాష్ట్రం ఉన్నప్పటికీ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించారు. ఆ తర్వాత చంద్రబాబు హయాంలో నియమించిన పీఆర్‌సీని మూడున్నర ఏళ్ల తర్వాత ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగులు ఆందోళనకు సిద్దమై రోడ్డెక్కడంతో రెండున్నర సంవత్సరాల తర్వాత వైసీపీ ప్రభుత్వం శుక్రవారం పీఆర్‌సీని ప్రకటించింది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా పీఆర్‌సీని ఉద్యోగులు కోరినంత ఇవ్వలేమనీ, తెలంగాణ ప్రభుత్వంతో పోల్చుకోవద్దనీ గురువారమే ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాల నేతల ముందు కుండబద్దలు కొట్టారు. ప్రస్తుతం ఇస్తున్న ఐఆర్‌ 27 శాతానికి తక్కువ కాకుండా ఇవ్వాలని ఏపీఎన్‌జీఓ జేఏసీ నేత కోరినప్పటికీ శుక్రవారం ప్రకటించిన పీఆర్‌సీలో దానిని 23 శాతానికి ఖరారు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం తెలివిగా కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసిన పీఆర్‌సీ 14.29 శాతాన్ని తెరపైకి తీసుకొచ్చింది. బేరం ఇక్కడ నుంచి మొదలుపెట్టింది. సీఎస్‌ కమిటీతో కూడా ఇదే చెప్పించారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు అదనంగా ఇస్తున్న 17 శాతం ఆర్ధిక ప్రయోజనాలు గురించి ఇటు ప్రభుత్వం గానీ, అటు సీఎస్‌ గానీ నోరెత్తలేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుక్రవారం ప్రకటించిన పీఆర్‌సి 23 శాతానికి కుదించారు. దీంతో ప్రస్తుతం ఐఆర్‌ 27 శాతం తీసుకుంటున్న ఉద్యోగులకు 23 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వడంతో నేరుగా 4 శాతం జీతాలు తగ్గనున్నాయి.

ఇక పదవివిరమణ వయస్సు  60 నుంచి 62 సంవత్సరాలకు పెంచడం, ఉద్యోగుల డీఏలు ఈ నెల జీతాలతో కలిపి ఇవ్వాలని ఆదేశించడం, ఆయా వర్గాలకు సంతృప్తి కలిగించినప్పటికీ ఉద్యోగుల్లో మాత్రం తీవ్ర అసంతృప్తి నెలకొంది. తీవ్ర  అసంతృప్తి చెందిన ఉద్యోగులు సామాజిక మాధ్యమాల్లో పోస్టుల ద్వారా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. బొప్పన్న చెప్పనా.. నుంచి బండెన్నా.. అంతా తొండెన్నా అంటూ కామెంట్స్ తెగ పేలుతున్నాయి. అన్నీ ఫట్.. వేల ఉద్యోగాలు ఫట్ అని కూడా కామెంట్స్ వస్తున్నాయి. రుణం తీర్చుకున్న ఉద్యోగ సంఘాలు అని కొందరు పోస్టులు పెట్టారు. మొత్తంమీద పీఆర్‌సీ తీవ్ర అసంతృప్తిని రేకెత్తించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: