పవన్ కల్యాణ్ బాగా లేటయ్యారు. చాలా సందర్భాల్లో ఆయన నుంచి స్పందన, ప్రతి స్పందన ఆ మాత్రం లేటుగానే వస్తుందనుకోండి. అయితే ఈసారి ఆయన్ని ఎవరో వెనకుండి నడిపించినట్టు అనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీకి పంజాబ్ లో ఘోర అవమానం ఎదురైందని, అది భద్రతా వైఫల్యం అని ఇప్పటికే బీజేపీ అన్ని రాష్ట్రాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలో ఏపీలో కూడా బీజేపీ వివిధ రకాల నిరసన కార్యక్రమాలు చేపడుతూ కాంగ్రెస్ పై దుమ్మెత్తి పోస్తోంది. ఈ విషయంలో పవన్ కల్యాణ్ కాస్త ఆలస్యంగా స్పందించారు. పంజాబ్ ఘటన దురదృష్టకరం అంటూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

చేశారా..? చేయించారా..?
వాస్తవానికి గతంలో ప్రధాని నరేంద్రమోదీకి సంబంధించి ఏ అంశాన్నయినా వెంటనే సోషల్ మీడియా ద్వారా తన కార్యకర్తలకు చేరవేస్తుంటారు పవన్. కానీ పంజాబ్ లో ప్రధాని కాన్వాయ్ నిలిచిపోయిన విషయంలో మాత్రం పవన్ బాగా ఆలస్యంగా స్పందించారు. కొంతకాలంగా పవన్ సైలెంట్ మోడ్ లో ఉన్నారు. పొలిటికల్ గా ఆయన కొన్నిరోజులుగా యాక్టివ్ గా లేరని తెలుస్తోంది. అందుకే ఆ సమయంలో జరిగిన పంజాబ్ ఘటనపై ఆయన ఆలస్యంగా స్పందించారని అంటున్నారు. అయితే బీజేపీ అన్ని రాష్ట్రాల్లో నిరసనలు తెలియజేస్తోంది. ఆ పార్టీ మిత్ర పక్షాలు కూడా అన్ని చోట్లా ఆందోళనలు చేపట్టాయి. ఈ క్రమంలో ఏపీలో మాత్రం ఎలాంటి హడావిడి లేకపోవడంతో బీజేజీ సూచనలతోనే పవన్ ఈ ప్రకటన చేశారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.

దేశ ప్రధాని భద్రతకు సంబంధించిన అంశంగా దీన్ని బీజేపీ హైలెట్ చేస్తోంది. అయితే కాంగ్రెస్ మాత్రం సభకు జనం రాలేదని మోదీ వెనక్కి తిరిగి వెళ్లిపోయారని సెటైర్లు వేస్తోంది. ప్రత్యేక కమిటీ ద్వారా నిజానిజాలు వెలికి తీస్తామని చెప్పింది. కానీ బీజేపీ మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకుంది. ఇది దేశ రాజకీయాల్లోనే ఓ దురదృష్టకర ఘటన అని అభివర్ణిస్తోంది.

తాజాగా పవన్ కల్యాణ్ కూడా ఇదో ఓ దురదృష్టకర ఘటన అంటున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయడం ప్రజల హక్కే కానీ.. ప్రధానికి ఇబ్బంది కలిగించేలా చేయడం సరికాదని అన్నారు పవన్. ప్రోటోకాల్స్ ని పాటించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని చెప్పారు. అంత ఇబ్బంది కలిగించినా ప్రధాని సంయమనం పాటించారని మెచ్చుకున్నారు పవన్.

మరింత సమాచారం తెలుసుకోండి: