తెలంగాణలో కరోనా ఓమిక్రాన్ పరిస్థితుల పై వేసిన పిల్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం. రూలింగ్ పార్టీతో సహా అన్ని పార్టీలు కరోనా నిబంధనలను పాటించేలా చూడాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కరోనా కేసులు పెరుగుతున్నాయి కాబట్టి టెస్టులు కూడా పెంచాలని వైద్య శాఖకు సూచించింది. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా పాటించాలని తెలిపింది. తెలంగాణ అధికార పార్టీ కరోనా నిబంధనలను పాటించకుండా రైతు బంధు సంబరాలను నిర్వహించారని హైకోర్టులో దాఖలైన పిల్ పై చీఫ్ జస్టిస్ డివిజన్ బెంచ్ శుక్రవారం విచారణ చేపట్టింది.

 టిఆర్ఎస్ పార్టీ కరోనా నిబంధనలు పాటించకుండా కార్యక్రమాలు నిర్వహిస్తోందని  పిటిషనర్లు పేర్కొన్నారు. ఇతర రాజకీయ పార్టీలు ఏ కార్యక్రమాలు పెట్టిన వారికి అనుమతించడం లేదంటూ హైకోర్టుకు తెలిపారు పిటిషనర్లు. అలాగే కరోనా నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ  పిటిషన్ లో పేర్కొన్నారు. పిటిషన్ పై విచారణ చేసిన చీఫ్ జస్టిస్ డివిజనల్ బెంచ్ రూలింగ్ పార్టీ తో పాటు అన్ని పార్టీలు కరోనా గైడ్ లైన్స్ పాటించాలని ఆదేశించింది. ఓమిక్రాన్ వైరస్ తీవ్రస్థాయిలో ఉన్నందున టెస్టులు పెంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఓమిక్రాన్ వైరస్ చిన్న పిల్లల్లో కూడా చాలా తీవ్రంగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ప్రస్తుతం ఉన్న నీలోఫర్ ఆసుపత్రితో పాటు అదనంగా కొన్ని హాస్పిటల్స్ ను పెంచాలని సూచించింది. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కంటైన్మెంట్, మైక్రో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఇక కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 21, 28 తేదీల్లో జారీచేసిన గైడ్ లైన్స్ ని రాష్ట్ర ప్రభుత్వం పాటించాలని ఆదేశించింది హైకోర్టు.

 థియేటర్స్,మాల్స్ బస్ స్టేషన్స్, రైల్వే స్టేషన్ లతో పాటు ఇతర కమర్షియల్ ఎస్టాబ్లిష్ మెంట్స్ తో నియమ నిబంధనలు తప్పక పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. వారాంతంలో జరిగే సంతలతోపాటు, జనం ఎక్కువగా ఉండే పబ్లిక్ ప్లేసుల్లో కోవిడ్ రూల్స్ పాటించాలని ఆదేశించింది. రాష్ట్రంలో కోవిడ్, ఓమిక్రాన్ పరిస్థితులపై రిపోర్ట్ తయారు చేసి ఈనెల 17 లోపు హై కోర్టుకు సబ్మిట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరింది హైకోర్టు. ఓమిక్రాన్, కరోనా పరిస్థితులపై తదుపరి విచారణ ఈ నెల 17 కు వాయిదా వేసింది హైకోర్టు.

మరింత సమాచారం తెలుసుకోండి: