సోనూ సూద్ పంజాబ్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. పంజాబ్ స్టేట్ ఐకాన్ గా ఉన్న సోనూ సూద్ తాజాగా ఆ హోదా తనకు వద్దని చెప్పేశారు. తానింక ఆ పదవిలో ఉండనని చెప్పారు. అయితే దీనివెనక పెద్ద కథ నడిచిందని సమాచారం. ఎన్నికల కమిషన్ సూచన వల్ల్ సోనూ సూద్ స్టేట్ ఐకాన్ పదవినుంచి తప్పుకున్నాడని అంటున్నారు.

సోనూ సూద్ సోదరి మాళవిక సచార్, పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నారు. దీనికోసం ఆమె మోగా ప్రాంతంలో ఇప్పటికే ప్రచార పర్వం హోరెత్తిస్తున్నారు. అక్కడ సైకిళ్లు పంపిణీ చేస్తూ స్థానికుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సోనూ సూద్ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే రాష్ట్ర ఐకాన్ గా ఉన్న వ్యక్తి ఇలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం, అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయడం సరికాదని ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదులందాయి. దీంతో కమిషన్ సూచన మేరకు సోనూ ఆ పదవినుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు.

లాక్ డౌన్ టైమ్ లో సోనూ సూద్ కి దేశవ్యాప్తంగా వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ క్రేజ్ తోనే ఆయన సోదరి మాళవిక పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు. సోనూ సూద్ వల్ల తన గెలుపు నల్లేరుపై నడక అవుతుందని ఆశించారు. అయితే ఏదైనా పార్టీలో చేరి ఆ పార్టీ టికెట్ పై పోటీ చేయడం కంటే ఇండిపెండెంట్ గా బరిలో దిగడం మేలని భావించారామె. సోనూ సూద్ కూడా పార్టీల వ్యవహారాల్లో తలదూర్చాలనుకోలేదు. అందుకే సోదరిని స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలబెట్టాలనుకున్నారు. అలాగే ప్రచారం కూడా చేపట్టారు. మాళవిక సూద్ కోసం మోగా ప్రాంతంలో జరిగే ప్రచార కార్యక్రమాల్లో సోనూ సూద్ పాల్గొంటున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐకాన్ అనే హోదాలో ఉన్న సోనూ అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం సరికాదని విమర్శలు వినిపించాయి. దీంతో సోనూ సూద్ ఐకాన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

గతంలో ఢిల్లీ ప్రభుత్వం కూడా సోనూ సూద్ ని బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసింది. ఆ తర్వాత సోనూ సూద్ ఇల్లు, ఇతర కార్యాలయాలపై ఐటీ దాడులు కలకలం రేపాయి. అయితే వాటికి రాజకీయ కోణంలో చూడొద్దని సోనూ ప్రకటించడం విశేషం. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు పంజాబ్ రాష్ట్ర ఎన్నికల సందర్భంగా తన ఐకాన్ పదవికి సోనూ రాజీనామా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: