తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని ఎంపిక చేసిన త‌రువాత పార్టీలో సీనియ‌ర్లు వ్య‌తిరేక గ‌ళం వినిపించ‌డం మొద‌లు పెట్టారు. మొద‌ట్లో అంత‌ర్గ‌త క‌ల‌హాలతో పాటు బ‌హిరంగంగానే రేవంత్ నాయ‌క‌త్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ వ‌చ్చారు. కొన్ని రోజుల తరువాత సీనియ‌ర్ల‌ను క‌లుపుకువెళ్ల‌డంలో రేవంత్ కాస్త పైచేయి సాధిస్తున్న క్ర‌మంలో.. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫ‌లితాలతో పార్టీలో మ‌రోసారి అంత‌ర్గ‌త క‌ల‌హాలు బ‌గ్గుమ‌న్నాయి. ఈ విష‌యంపై హైక‌మాండ్‌కు సీనియ‌ర్లు ఫిర్యాదు కూడా చేశారు. అప్ప‌టి నుంచి పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి రేవంత్ పై గుర్రుగానే ఉంటున్నారు. ఇప్పుడు తాజాగా సీఎం ఫాంహౌజ్ ఉన్న ఎర్ర‌వెల్లి స‌మీపంలో చేప‌ట్ట‌నున్న ర‌చ్చ‌బండ కార్యక్ర‌మం పై ర‌చ్చ‌మొద‌ల‌యింది.


  ఈ అంశం గురించి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి రెవంత్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ హైక‌మాండ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్ర‌మంలో టీ కాంగ్రెస్ పొలిటిక‌ల్ క‌మిటీ భేటి జ‌రిగింది. రేవంత్ కు క‌రోనా రావ‌డంతో జూమ్ ద్వారా చేసిన స‌మావేశం హాట్‌హాట్‌గా సాగింది. పార్టీ యాక్ష‌న్ ప్లాన్ కంటే ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శించుకోవ‌డం, ఫిర్యాదులు చేసుకోవ‌డంపై ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చిన‌ట్టు స‌మాచారం. ఈ స‌మావేశంలో పాల్గొన్న పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ రేవంత్ రెడ్డిపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. సీనియ‌ర్ల‌ను క‌లుపుకుని వెళ్లాల‌ని సూచించిన‌ట్టు స‌మాచారం. పార్టీలో ఎవ‌రికి ఇబ్బంది ఉన్నా.. సోనియాగాంధీకి లేదా త‌న‌కు లేఖ రాయాల‌ని సూచించారు.  


అయితే, పార్టీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు కొన‌సాగుతూనే ఉంటున్నాయి. దీనికి పార్టీలో అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం ఎక్కువ అని చెబుతూ క‌వ‌ర్ చేసుకుంటూ ఉంటారు. కానీ, అధికారంలో ఉన్న‌ప్పుడు ఎలాంటి న‌ష్టం లేకున్నా.. ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో తీవ్ర న‌ష్టం వాటిల్లుతుంద‌న్న విష‌యం వారికి కూడా తెలిసిందే. అయినా, నేత‌ల వ్య‌వ‌హారంలో ఎలాంటి మార్పులు క‌నిపించ‌డం లేదు. దీంతో రాబోయే రోజుల్లో పార్టీకి గ‌డ్డుకాలం త‌ప్ప‌ద‌ని పార్టీ వ‌ర్గాలు ఆందోళ‌న చెందుతున్నాయి. ఈ క్ర‌మంలో పార్టీని ముందుండి న‌డిపించాల్సి పీసీసీ చీఫ్ రేవంత్ సీనియ‌ర్ల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు ఎలాంటి వ్యూహాలు అమ‌లు చేస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.  


   


మరింత సమాచారం తెలుసుకోండి: