జోనల్‌, మల్టీ జోనల్‌ ఉద్యోగుల విభజన, కేటాయింపుల ప్రక్రియ పూర్తయింది. శుక్రవారం సాయంత్రానికల్లా అన్ని శాఖల ఉద్యోగులకు కేటాయింపులను పూర్తి చేశారు. పోస్టింగులు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించారు. ఈ ప్రక్రియ శనివారంతో పూర్తి కానుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్‌ ఓ ప్రకటనలో వివరించారు. ఈ మేరకు పోస్టింగుల ఉత్తర్వులను ఆర్థిక శాఖ ‘ఇంటిగ్రేటెడ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌(ఐఎ్‌ఫఎంఐఎస్‌)’ నుంచి ఫోన్‌ ఎస్‌ఎంఎ్‌సల రూపంలో జారీ చేస్తున్నారు. జోనల్‌, మల్టీ జోనల్‌ ఉద్యోగుల పోస్టింగుల కోసం 34 శాఖల్లో ముఖ్య కార్యదర్శులు, విభాగాధిపతుల నేతృత్వంలో అంతర్గత కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు రెండు రోజులుగా కసరత్తు చేసి, కేటాయింపుల ప్రక్రియను పూర్తి చేశాయి. ఇదివరకు అమల్లో ఉన్న 5, 6 జోన్లలో సీనియారిటీని ఆధారంగా చేసుకుని ఉద్యోగులకు కొత్త జోన్లు, మల్టీ జోన్లవారీగా కేటాయింపులు జరిపారు. ఇలా కేటాయింపులు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు శుక్రవారం రాత్రి నుంచి పోస్టింగులు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించారు.

కొత్తగా ఏర్పడిన కాళేశ్వరం జోన్‌-1లోని కుమ్రం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలు.. బాసర జోన్‌-2లోని ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాలు.. రాజన్న జోన్‌-3లోని కరీంనగర్‌, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్‌, కామారెడ్డి జిల్లాలు.. భద్రాద్రి జోన్‌-4లోని కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాలు.. యాదాద్రి జోన్‌-5లోని సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి, జనగామ జిల్లాలు.. చార్మినార్‌ జోన్‌-6లోని మేడ్చల్‌-మల్కాజిగిరి, హైదరాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలు.. జోగులాంబ జోన్‌-7లోని వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాలవారీగా పోస్టింగులు ఇస్తున్నారు. శనివారం నాటికి అందరికీ పోస్టింగులు ఇచ్చేలా వేగం పెంచారు. పోస్టింగుల సమాచారం అందిన మూడు రోజుల్లోగా తమకు కేటాయించిన జిల్లాల్లో ఉద్యోగులు విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలోని రెండు మల్టీ జోన్ల ఉద్యోగుల కేటాయింపులు కూడా పూర్తయ్యాయి. మల్టీ జోన్‌-1లో కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి జోన్లు.. మల్టీ జోన్‌-2లో యాదాద్రి, చార్మినార్‌, జోగులాంబ జోన్లు ఉన్నాయి. ఈ మల్టీ జోన్లవారీగా కేటాయించిన ఉద్యోగులకు కూడా శనివారంలోపు పోస్టింగులు ఇవ్వనున్నారు. వీరు మూడు రోజుల్లో విధుల్లో చేరాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr