తమిళనాడును కరోనా మహమ్మారి వణికిస్తోంది. 24గంటల వ్యవధిలోనే ఆ రాష్ట్రంలో ఏకంగా 8వేల 981మంది కరోనా బారిన పడ్డారు. ఈ వైరస్ వల్ల 8మంది మృతి చెందారు. ప్రస్తుతం 30వేల 817 యాక్టివ్ కేసులున్నాయి. అయితే కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం జనవరి 6నుంచి నైట్ లాక్‌ డౌన్ డౌన్ తో పాటు.. ఆదివారాలు పూర్తి లాక్ డౌన్ ప్రకటించింది.

మరోవైపు తమిళనాడులో కరోనా కేసులు వేగంగా పెరుగుతుండటంతో దక్షిణ రైల్వే కీలక ప్రకటన చేసింది. చెన్నై సబర్బన్ రైళ్లలో ప్రయాణించాలంటే వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవాలని స్పష్టం చేసింది. టీకా వేయించుకున్నట్టు సర్టిఫికెట్ చూపిస్తేనే రైళ్లు ఎక్కనిస్తామని.. ఈ జనవరి 10నుంచి 31వరకు ఈ రూల్ అమల్లో ఉంటుందని తెలిపింది. అలాగే సౌత్ జోన్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో మాస్క్ లేకుండా కనిపిస్తే 500రూపాయలు ఫైన్ వేస్తామని హెచ్చరించింది.

ఇక మహారాష్ట్రలోనూ కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఒక్కరోజే ఏకంగా 40వేల 925 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 20మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఆ రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య లక్షా 41వేల 492కు చేరింది. ఒమిక్రాన్ కేసుల్లోనూ మహారాష్ట్ర ముందు వరుసలోనే ఉంది. అక్కడ 876మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకిందని నిర్ధారణ అయింది. అయితే ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఇప్పటికే ఆంక్షలు విధించింది.

మరోవైపు ఏపీలోనూ కరోనా కేసులు పెరగడంతో ప్రభుత్వం నేటి నుంచి పాక్షిక లాక్ డౌన్ విధిస్తుందంటూ వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు నైట్ కర్ఫ్యూ, ఆంక్షలు విధించలేదని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే ఏపీలో నైట్ కర్ఫ్యూ రాత్రి 10గంటల నుంచి ఉదయం 5గంటల వరకు ఉంటుందని.. దుకాణాలు సాయంత్రం 7గంటలకే మూసివేయాలంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.మరింత సమాచారం తెలుసుకోండి: