తెలంగాణలో ప్ర‌స్తుతం బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పేరు మార్మోగిపోతోందనే చెప్పాలి. ఇటీవ‌ల ఆయ‌న చేప‌ట్టిన జాగ‌ర‌ణ దీక్ష‌తో రాష్ట్ర రాజ‌కీయాలు హీటెక్కిపోయాయి. దీక్ష చేప‌ట్టిన బండి సంజ‌య్‌ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు త‌ర‌లించ‌డం త‌రువాత రిమాండ్ ర‌ద్దు చేయ‌డం అంతా వెనువెంట‌నే జ‌రిగిపోయాయి. దీంతో టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై బీజేపీ కేంద్ర నాయ‌కులు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇందులో భాగంగానే ఆ పార్టీ జాతీయాధ్య‌క్షుడు జేపీ.న‌డ్డా, మ‌ధ్యప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రానికి వ‌చ్చి సీఎం కేసీఆర్‌పై మండిప‌డ్డారు. అయితే, ఇవ‌న్ని ఒక ఎత్త‌యితే ప్ర‌స్తు ప‌రిణామాల‌ను ప్ర‌ధాని మోడీ దృష్టికి తీసుకెళ్ల‌డంతో మోడీ ఈ రోజు బండి సంజ‌య్‌కు ఫోన్ చేసీ మాట్లాడారు.



     బండి సంజ‌య్‌కు మోడి ఫోన్ చేసి దాదాపు 15 నిమిషాల పాటు మాట్లాడారు. తెలంగాణ‌లో చోటు చేసుకున్న తాజా రాజ‌కీయ ప‌రిణామాల గురించి అడిగి తెలుసుకున్నట్టు స‌మాచారం. సంజ‌య్ అరెస్ట్ చేప‌ట్టిన దీక్ష, అరెస్ట్ అనంత‌రం జరిగిన అంశాల‌పై చ‌ర్చించారు. అయితే, స్వ‌యంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడి.. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడితో మాట్లాడ‌డంతో బండి సంజ‌య్ ఇమేజ్ మ‌రింత పెరిగిపోయింది. ఇప్ప‌టికే రాష్ట్రంలో  టీఆర్ఎస్‌కు ప్ర‌త్యామ్నాయంగా ఎద‌గాల‌ని చూస్తున్న బీజేపీకి బండి సంజ‌య్ ను  అస్త్రంగా మ‌ల్చుకునేందుకు పార్టీ అగ్ర నాయ‌క‌త్వం చూస్తోంది. ఎందుకంటే, గ‌తంలో ఉన్న పార్టీ అధ్య‌క్షుల కంటే బండి సంజ‌య్ రాక‌తో కాషాయ ద‌ళంతో దూకుడు మ‌రింత పెరిగింద‌నే చెప్పాలి.



    ఎన్న‌డూ లేని రీతిలో రాష్ట్రంలో బీజేపీ హ‌వా కొన‌సాగుతుంది. 2018 ఎన్నిక‌ల‌కు ముందు ఎక్కువ స్థానాలు ఉన్నా, త‌రువాతి ఎల‌క్ష‌న్స్‌లో సిట్టింగు స్థానాల‌ను కూడా కోల్పోయింది. అనంత‌రం జ‌రిగిన మూడు ఉప ఎన్నిక‌ల్లో రెండింట్లో కాషాయ జెండా ఎగుర‌వేసింది. దీంతో పార్టీ అధ్య‌క్షుడిగా ఉన్న బండి సంజ‌య్ కు మ‌రింత పేరు పెరిగింది. తాజా ప‌రిణామాల‌తో బీజేపీ సీఎం రేసులో బండి ఉన్నాడ‌న్న వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఇక మోడీ ఫోన్ కాల్ చేయ‌డంతో బండి సంజ‌య్ ఇక ముందు మ‌రింత‌ దూకుడుగా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: