కొంత కాలం గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ మళ్లీ జనసైనికుల ముందుకు వస్తారని ఆశించిన అభిమానులు కాస్త నిరాశ పడ్డారు. పవన్ కల్యాణ్ జనసేన మీటింగ్ వాయిదా వేశారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంగళగిరిలోని పార్టీ ఆఫీస్ లో పెట్టాలనుకున్నారు పవన్ కల్యాణ్. ఈ మీటింగ్ తో ఇటీవల కొంతకాలం స్తబ్దుగా ఉన్న జనసేన రాజకీయాలను వేడెక్కించాలనుకున్నారు. కానీ చివరి నిముషంలో మీటింగ్ వాయిదా పడింది.

క్లారిటీ వస్తుందా..?
ఓవైపు ఏపీలో బీజేపీ సోలో పర్ఫామెన్స్ ఇస్తోంది. జనసేన మిత్రపక్షం అని చెప్పుకుంటున్నా.. ఆ పార్టీని కానీ, నాయకుల్ని కానీ, కార్యకర్తల్ని కానీ కలుపుకొని వెళ్లే ప్రయత్నం చేయడంలేదు. దీంతో ఒకరకంగా జనసేన కూడా నీరసపడిపోయింది. ఇటు పవన్ కల్యాణ్ కూడా నేరుగా జనం ముందుకు రావడం తగ్గించేశారు. సినిమాలతో బిజీ అయ్యారు. ఈ దశలో మళ్లీ కార్యకర్తల్లో ఊపు రావాలంటే, సభలు సమావేశాలు జరగాల్సిందే. దీంతో ఇటీవలే పవన్ కల్యాణ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం పేరుతో అందరినీ ఒకే చోట చేర్చాలనుకున్నారు. కానీ ఆ సమావేశాన్ని వాయిదా వేశారు. కొవిడ్ కారణంగా మీటింగ్ వాయిదా వేస్తున్నట్టు జనసేన పార్టీ కార్యాలయం ప్రకటించింది.

వన్ సైడ్ లవ్ పై తేల్చేస్తారా..?
అటు కుప్పంలో చంద్రబాబు జనసేనతో కలసి పోటీ చేసే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఇష్టమే కానీ, అటువైపునుంచి స్పందన లేదని చెప్పారు. ఈ దశలో చంద్రబాబు వ్యాఖ్యలపై కూడా పవన్ కల్యాణ్ స్పందించాల్సి ఉంది. లేకపోతే పవన్ పరోక్షంగా ఆ వన్ సైడ్ లవ్ ని ఒప్పుకున్నట్టే లెక్క. పవన్ ఈ దశలో అటు బీజేపీపై కానీ, ఇటు టీడీపీ పొత్తు వ్యవహారంపై కానీ ఎలాంటి వివరణ ఇస్తారనేదానికోసం జనసైనికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

నింపాదిగా.. నిదానంగా..
పవన్ కల్యాణ్ 2024 ఎన్నికలను టార్గెట్ చేసుకున్నారని చెబుతున్నా.. ఇంకా దూకుడు పెంచలేదు. ఎన్నికలకు సమయం రెండేళ్లకు వచ్చేసినా పొత్తులపై పూర్తి స్థాయిలో క్లారిటీ రాలేదు. పోనీ నియోజకవర్గానికి ఇన్ చార్జిని ప్రకటించి వారిని పూర్తి స్థాయిలో పనిచేసుకోమని చెప్పారా అంటే అదీ లేదు. జనసైనికులు మాత్రం పొత్తులతో చిత్తవకుండా ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నారు. దీనిపై తుది నిర్ణయం మాత్రం పవన్ దే.

మరింత సమాచారం తెలుసుకోండి: