ఢిల్లీలో రైతు ఉద్యమం సూపర్ హిట్టు. దాదాపుగా ఏడాదిగా వారు ఢిల్లీ శివార్లలో ఉద్యమం చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచారు. రైతు చట్టాలపై వెనక్కు తగ్గేలా చేశారు. ఇప్పుడు ఇదే తరహా ఉద్యమాన్ని టీడీపీ కూడా మొదలు పెట్టాలనుకుంటోంది. దగా పడ్డ రైతన్న పేరుతో రైతు ఉద్యమాన్ని జనంలోకి తీసుకెళ్తోంది టీడీపీ.

విత్తనం నుంచి విక్రయం వరకు..
విత్తనం నుంచి విక్రయం వరకు దగాపడ్డ రైతన్న అనే పేరుతో టీడీపీ ఓ నిరసన కార్యక్రమాన్ని ప్లాన్ చేసింది. బొబ్బిలికోట నుంచి ఈ నిరసన ప్రదర్శన జరిగింది. అయితే దీన్ని ఒకరోజుతో ఆపేయకుండా ఎన్నికల వరకు పెద్ద ఉద్యమంగా తీసుకెళ్లాలని భావిస్తోంది టీడీపీ.

ఇప్పటికే అమరావతి రైతుల పేరుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. అదే సమయంలో కొన్నిచోట్ల విత్తనాలకోసం, యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇక గిట్టుబాటు ధర, ప్రభుత్వ సేకరణ సంగతి సరే సరి. ప్రస్తుతానికి ప్రభుత్వం రైతు భరోసా నిధులతో ఆదుకుంటున్నా.. అది ఏమూలకు సరిపోదు అనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ దశలో రైతుల ఉద్యమాన్ని తెరపైకి తెచ్చి నడపాలని చూస్తోంది టీడీపీ.

అటు ఉద్యోగుల్లో కూడా కాస్తో కూస్తో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. ఆశించిన పీఆర్సీ ఇవ్వలేదని వారు మథనపడుతున్నారు. ఈ క్రమంలో ఇటు రైతుల్ని కూడా తమవైపు తిప్పుకుని ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టాలని చూస్తున్నారు టీడీపీ నేతలు. ఇప్పటినుంచే ఉద్యమం మొదలు పెట్టి ఊరూరా అందర్నీ కలుపుకొని పోవాలని చూస్తున్నారు టీడీపీ నేతలు. భవిష్యత్తులో ఇదే ఉద్యమంలో బీజేపీ, జనసేన కూడా భాగస్వాములు అయితే ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరుగుతుందని అంటున్నారు.


ఇప్పటికిప్పుడు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చే అంశం ఏదీ లేకపోవడంతో మెల్లగా ఇలా రైతు ఉద్యమాన్ని హైలెట్ చేస్తున్నారు టీడీపీ నేతలు. హస్తినలో సూపర్ హిట్ అయిన రైతు ఉద్యమం ఏపీలో ఎలాంటి రిజల్ట్ తీసుకొస్తుందో చూడాలి. అక్కడ పొలిటికల్ పార్టీల ప్రభావం ఏదీ లేకపోవడంతో ఉద్యమం విజయవంతం అయింది. ఇక్కడ టీడీపీ బ్యాక్ ఎండ్ తో రైతు ఉద్యమం మొదలైతే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: