ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ఉంది. ఒక మాటలో చెప్పాలంటే జీతాలు కూడా సకాలంలో చెల్లించలేని దుస్థితి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం... సంక్షేమ పథకాల అమలులో ఏ మాత్రం వెనుకడుగు వేయటం లేదు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆ సమయంలో ప్రజలకు, ఉద్యోగులకు ఇబ్బంది ముబ్బడిగా హామీలు ఇచ్చారు. అలాగే సరిగ్గా ఎన్నికల సమయంలో నవరత్నాల పేరుతో మేనిఫెస్టో విడుదల చేశారు. అన్ని వర్గాల వారికి న్యాయం చేసేలా నవరత్నాలు రూపొందించారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 90 శాతం పైగా హామీలు అమలు చేసినట్లు వైసీపీ నేతలు గర్వంగా చెప్పుకున్నారు. అయితే  ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో... పథకాల అమలుకు నిధుల కొరత అడ్డంకిగా మారింది. ఓ వైపు అప్పుల భారం భారీగా పెరుగుతుండటంతో పాటు... అటు ఆదాయం కూడా పడిపోవడంతో... పథకాలు కాస్త గుదిబండగా మారిపోయాయి.

ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఓ కీలక కార్యక్రమాన్ని వాయిదా వేసింది. ప్రతి ఏటా సంక్రాంతి సమయంలో రెండు పథకాలను వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇప్పుడు ఆ రెండు పథకాల అమలు వాయిదా పడింది. ఇందులో మొదటిది అమ్మఒడి పథకం. ప్రతి ఏటా జనవరి 10వ తేదీన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 15 వేల రూపాయల నగదును ప్రభుత్వం జమ చేస్తోంది. ఇది ఇప్పుడు జూన్ నెలకు వాయిదా పడింది. అలాగే ఈబీసీ నేస్తం పథకం కూడా ఇప్పుడు వాయిదా పడింది. ఈ నెల పదవ తేదీన ఈబీసీ నేస్తం పథకం కోసం ముహుర్తం ఖరారు అయ్యింది. పథకం ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కర్నూలు జిల్లా నంద్యాలలో పర్యటించాల్సి ఉంది. ఇప్పటికే భారీ ఏర్పాట్లు కూడా చేశారు. 45 ఏళ్లు దాటిన ఓసీ మహిళలకు ప్రతి ఏటా 15 వేల రూపాయలు అందించాలని గతంలో నిర్ణయించారు. ఈ పథకానికి దాదాపు 650 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అధికారులు అంచనా వేశారు. కానీ ప్రస్తుతం నిధుల సమీకరణ అసాధ్యంగా మారిపోయింది. దీంతో తప్పని పరిస్థితుల్లో ఈబీసీ నేస్తం పథకం ప్రస్తుతానికి వాయిదా పడింది.


మరింత సమాచారం తెలుసుకోండి: