అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల అసెంబ్లీలకు మరో నెల రోజుల్లో మొదటి దశ పోలింగ్ జరగనుంది. మొత్తం ఏడు దశల్లో ఈ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఫిబ్రవరి 10వ తేదీన మొదలయ్యే పోలింగ్ ప్రక్రియ... మార్చి 7వ తేదీతో ముగియనుంది. సరిగ్గా మూడు రోజులకు మార్చి 10వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఐదు రాష్ట్రాల్లో కేవలం పంజాబ్‌లో మాత్రమే... కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారం చెలాయిస్తోంది. నాలుగు రాష్ట్రాల్లో మరోసారి అధికారం సాధించేందుకు ఇప్పటికే కమలం పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఇక పంజాబ్ రాష్ట్రంలో కూడా తమదే అధికారం అని ఇప్పటికే బీజేపీ పెద్దలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు తగినట్లుగా... ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు కూడా.

పంజాబ్ రాష్ట్రంలోని 117 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తోంది సీఈసీ. ఫిబ్రవరి 14న రెండో విడతలో అన్నీ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే.. 59 స్థానాలు గెలవాల్సి ఉంది. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ 77 స్థానాలను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్... బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇక పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ అయితే ప్రస్తుతం సీఎం చన్నీపై తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో పంజాబ్ కోసం బీజేపీ కూడా ప్లాన్ చేస్తోంది. అందుకోసమే అందుబాటులోని అన్ని వనరులను భారతీయ జనతా పార్టీ నేతలు వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా ఓటర్లను ఆకట్టుకోవడంలో అందె వేసిన చెయ్యిలా ఉండే ప్రధాని నరేంద్ర మోదీ... కీలక ప్రకటన చేశారు. ప్రతి ఏటా డిసెంబర్ 26వ తేదీన వీర బాలల దినోత్సవం నిర్వహించుకోవాలని మోదీ ప్రకటన చేశారు. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. సిక్కుల మత గురువు గురు గోవింద్ గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు మోదీ తెలిపారు. ఈ ఏడాది నుంచే ఈ వేడుకను కేంద్రం అధికారికంగా నిర్వహిస్తుందని కూడా ప్రకటించారు మోదీ. దేశం మొత్తం గురు గోవింద్ సింగ్ కుమారులను స్మరించుకోవాలని కూడా మోదీ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ ప్రకటన చేశారనే అభిప్రాయాలు అప్పుడే వ్యక్తమౌతోన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: