ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా ప‌డ‌గ‌నీడ మ‌రోసారి మ‌న‌దేశంపైనా ప‌ర‌చుకుంటుండ‌టంతో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మై ఇప్ప‌టికే అవ‌స‌ర‌మైన జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. మెట్రోన‌గ‌రాల్లో రాత్రి పూట క‌ర్ఫ్యూ విధించ‌డంతో పాటు, ప‌లు రాష్ట్రాల్లో ఇప్ప‌టికే ఆంక్ష‌లు అమ‌ల‌వుతున్నాయి. అయినా కేసుల ఉధృతి రోజురోజుకు పెరుగుతోంది. 24 గంట‌ల వ్య‌వ‌ధిలోనే 1,60,000కు పైగా కొత్త కేసులు రావడంతో రానున్న రోజుల్లో ఈ సంఖ్య మ‌రింత‌గా పెర‌గ‌డం ఖాయంగా కనిపిస్తోంది. పాజిటివిటీ రేటు 10 శాతం దాట‌డం ఆందోళ‌న‌క‌ర‌మేన‌ని వైద్య ఆరోగ్య శాఖ వ‌ర్గాలు చెపుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేసేందుకు, ప్రధాని న‌రేంద్రమోదీ ఆదివారం ప‌లువురు ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మంలో కోవిడ్ నియంత్ర‌ణ కోసం ప‌ని చేస్తున్న నిపుణులు, ప‌లు శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

రెండో వేవ్ స‌మ‌యంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు త‌గినంత స‌న్న‌ద్ధంగా లేక‌పోవ‌డం, ఆక్సిజ‌న్‌, మందుల కొర‌త‌తో పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. ఈసారి అలాంటి ప‌రిస్థితి రాకుండా ముంద‌స్తుగా తీసుకున్న‌ జాగ్ర‌త్త‌లు, ఆక్సిజ‌న్‌, మందుల నిల్వ‌ల‌పై ప్ర‌ధాని అధికారుల‌నుంచి వివ‌రాలు అడిగి తెలుసుకుని, ప‌లు సూచ‌న‌లు చేసినట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే కేంద్రం కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది. దివ్యాంగులు, గ‌ర్భిణులు  ఇంటివ‌ద్ద‌నుంచే ప‌నిచేసేందుకు అనుమ‌తిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. క‌రోనా కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతున్నట్టుగా గుర్తించిన ప్రాంతాల్లో ప్ర‌భుత్వ అధికారులు, ఇత‌ర సిబ్బందికి కూడా ఇదే వెసులుబాటును క‌ల్పించింది. ఇదిలా ఉండ‌గా కోవిడ్ బారిన ప‌డిన రాజ‌కీయ, సినీ ప్ర‌ముఖులు జాబితా అంత‌కంత‌కూ పెరుగుతూనే ఉంది. ఝార్ఖండ్ ముఖ్య‌మంత్రి సీఎం హేమంత్‌సోరెన్ నివాసంలో ఆయ‌న భార్యాపిల్ల‌ల‌తో స‌హా 15మందికి కోవిడ్ పాజిటివ్ వ‌చ్చింది. ఆరోగ్య‌శాఖ మంత్రి బ‌న్నాగుప్తా కూడా దీని బారిన‌ప‌డిన‌ట్టు ప్ర‌భుత్వ  వ‌ర్గాలు తెలిపాయి. భాజ‌పా ఎంపీ వరుణ్‌గాంధీ కూడా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్టు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. స్వ‌ల్ప ల‌క్ష‌ణాలే ఉండ‌టంతో వీరంతా ప్ర‌స్తుతం హోమ్ ఐసొలేష‌న్‌లో ఉన్నారు. కాగా ప్ర‌జ‌లు స్వీయ నియంత్ర‌ణ చ‌ర్య‌లు పాటిస్తేనే మూడో వేవ్ ముప్పు నుంచి ర‌క్షించుకోగ‌ల‌మ‌ని వైద్య రంగ నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: