ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. సరిగ్గా నెల రోజులకు మొదటి విడత పోలింగ్ జరగనుంది. వచ్చే నెల 10వ తేదీన తొలి దశ పోలింగ్‌తో ప్రారంభమయ్యే ఎన్నికలు... మొత్తం ఏడు దశల్లో జరగనున్నాయి. మార్చి 7వ తేదీ ఏడవ దశ పోలింగ్‌తో ఓటింగ్ ప్రక్రియ ముగుస్తుంది. సరిగ్గా మూడు రోజుల తర్వాత మార్చి 10వ తేదీన ఎన్నికల ఫలితాల ప్రకటనతో నెల రోజుల ఎలక్షన్ పండుగ పూర్తవుతుంది. మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో ఎన్నికలు జరుగుతాయని అన్ని పార్టీల నేతలు భావించినప్పటికీ.... అనూహ్యంగా ఫిబ్రవరి నెలలోనే ఎన్నికలు ఉంటాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఫిబ్రవరి 14వ తేదీన పంజాబ్ అసెంబ్లీకి ఒకే విడతలో ఎన్నికలు పూర్తి చేస్తుంది. అయితే ఇప్పుడు అందరి కన్ను కూడా అత్యంత చిన్న రాష్ట్రమైన గోవాపైనే ఉంది. 40 స్థానాలున్న గోవా అసెంబ్లీ కోసం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా గోవా కోసం పోటీ పడుతోంది.

ఇప్పటికే దేశ తూర్పు తీరంలో హ్యాట్రిక్ విజయం సాధించారు మమతా బెనర్జీ. ప్రధాని నరేంద్ర మోదీ సహా.... కమలం పార్టీ అగ్రనేతలంతా కలిసి జోరుగా ప్రచారం చేసినా.... దీదీ సర్కార్‌పై దుమ్మెత్తి పోసినా.... తృణమూల్ నేతలను తమలో చేర్చుకున్నా కూడా... దీదీ గెలుపు ఆపలేక పోయారు. అదే జోరులో ఉన్న ఇప్పుడు పశ్చిమ తీరంలో కూడా పవర్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వాణిజ్యపరంగా అత్యంత దగ్గర సంబంధాలు ఉన్న గోవా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు దీదీ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్న మహారాష్ట్ర వాదీ గోమాంతక్ పార్టీతో టీఎంసీ పొత్తు పెట్టుకుంది. అలాగే ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలపైనే టీఎంసీ కన్నేసింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్న అసంతృప్త నేతలను ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా తమ పార్టీలో చేర్చుకుంటున్నారు దీదీ. ఇప్పటికే టీఎంసీ ఎంపీ మోహువా మిత్రాను గోవా ఇంఛార్జ్ గా నియమించారు మమతా బెనర్జీ. దాదాపు రెండు నెలలుగా గోవాలోనే మిత్రా మకాం వేశారు. దీంతో గోవాలో టీఎంసీ గెలుస్తుందో లేదో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: