ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన శత్రువు ఎవరూ అంటే... ప్రస్తుతం అంతా ఠక్కున చెప్పే సమాధానం నరసాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామ కృష్ణంరాజు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన రఘురామ ఘన విజయం సాధించారు. అయితే కొద్ది రోజులకే వైసీపీ ప్రభుత్వంపై తనదైన శైలిలో ఎదురుదాడి మొదలుపెట్టారు. నియోజకవర్గంలో జరిగిన ఓ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న రఘురామ... తన ప్రసంగానికి మాటిమాటికి అడ్డుపడుతున్న అభిమానులను చూసి కాస్త ఇబ్బండి పడ్డారు. జగన్ నాయకత్వం వర్థిల్లాలి అంటూ చేస్తున్న నినాదాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పైన, వైసీపీ నేతల పైన, వైసీపీ ప్రభుత్వం పైన తనదైన శైలిలో విమర్శలు చేస్తూనే ఉన్నారు. దాదాపు రెండేళ్లుగా ఢిల్లీకే పరిమితం అయిన రఘురామ కృష్ణంరాజు... కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా, వైసీపీ సర్కార్‌కు వ్యతిరేకంగా ప్రతి రోజు ప్రెస్ మీట్‌లు పెడుతున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతల కంటే కూడా ఆర్ఆర్ఆర్ చేస్తున్న వ్యాఖ్యలకే ఎక్కువ పాపులారిటీ వస్తోంది.

సంక్రాంతి పండుగ అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది గోదావరి జిల్లాలు. కొత్త అల్లుళ్లు, పిండి వంటలు, కోడి పందాలతో గోదావరి జిల్లాలు ఓ ప్రత్యేకత సంతరించుకుంటాయి. ఈ పండుగ కోసం సొంత జిల్లా నేతలతో పాటు ఇతర ప్రాంతాల వాళ్లు కూడా పెద్ద ఎత్తున గోదావరి జిల్లాలకు తరలి వస్తారు. ఇక కోడి పందాల సమయంలో అయితే... తమ తమ స్వగ్రామాల్లోనే నేతలంతా ఉంటారు. తమ అభిమానులు, కార్యకర్తలతో ఎంతో ఆనందంగా పండుగ జరుపుకుంటారు. కానీ.. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మాత్రం... దాదాపు రెండేళ్లుగా నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. పూర్తిగా ఢిల్లీకే పరిమితం అయిన రఘురామ.... తనను సొంత జిల్లాలో పర్యటించకుండా అడ్డుకుంటున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపైన, నేతలపైన కేంద్ర హోమ్ శాఖకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో రఘురామ దర్శనం లేకుండానే నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు రెండు సంక్రాంతులు పూర్తి చేసుకున్నారు. ఇక ముచ్చటగా మూడో సంక్రాంతికి అయినా... తమ ఎంపీగారు వస్తారో లేదో అని ఇప్పటికే బెట్టింగ్‌లు వేసుకుంటున్నారు కూడా.


మరింత సమాచారం తెలుసుకోండి: