ప్రొబేషన్ డిక్లరేషన్, రెగ్యులర్ పే స్కేల్ కోసం సచివాలయ ఉద్యోగులు చేస్తున్న ఆందోళన, నిరసన కార్యక్రమాల వ్యవహారం నేటితో ఓ కొలిక్కి వచ్చే అవకాశముంది. మేం పని మానేస్తే సచివాలయాలు మూసేసుకోవాల్సిందే అనే ధోరణిలో ఉన్నారు ఉద్యోగులు. ఇప్పటికే ఉన్నతాధికారులు పెట్టిన వాట్సప్ గ్రూప్స్ నుంచి అందరూ లెఫ్ట్ అవుతున్నారు. దాదాపుగా ఉద్యోగులంతా గ్రూపుల్లో లేకుండా ఒక్కతాటిపైకి వచ్చారు. సోమవారం నుంచి విధులకు హాజరు కాకూడదని కొన్ని చోట్ల తీర్మానించుకున్నారు. అయితే ఓటీఎస్ స్పెషల్ డ్రైవ్ వల్ల విధులకు హాజరు కావాల్సిందేనంటూ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ఈ దశలో అసలేం జరుగుతోంది అనేది ప్రశ్నార్థకంగా మారింది.

పోనీ ఓటీఎస్ స్పెషల్ డ్రైవ్ కోసం ఈ ఒక్కరోజు ఉద్యోగులు ప్రభుత్వ ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని విధులకు హాజరు అవుతారా..? లేక ఈరోజు తోనే తాడో పేడో తేల్చుకోవాలని చూస్తారా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి మాత్రం సచివాలయ ఉద్యోగుల ఆందోళనపై సానుకూల స్పందన లేదు. ప్రొబేషన్ డిక్లేర్ చేయడానికి సీఎం జగన్ గడువు విధించిన తర్వాత కూడా ఇలా ఆందోళన చేయడం సరికాదని ఉన్నతాధికారులు వారికి నచ్చజెబుతున్నారు. అయితే ఉద్యోగులు మాత్రం ఏదో ఒకటి తేల్చుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికే ప్రొబేషన్ ఆలస్యమైందని, ఇక వేచి చూసే పరిస్థితి లేదని చెబుతున్నారు. కేవలం 15వేల రూపాయల నెల జీతంతో రెండేళ్లుగా నెట్టుకొస్తున్నామని అంటున్నారు.

ప్రత్యామ్నాయం ఏంటి..?
ఉన్నట్టుండి సచివాలయాల్లో ఉద్యోగులు విధులు మానేస్తే పరిస్థితి ఏంటనేది తెలియడంలేదు. పోనీ వారి స్థానంలో మరొకరితో పని చేయించుకోవడం కుదురుతుందా.. లేక వారినే నచ్చజెప్పి విధులకు పిలుచుకు రావాలా అనే విషయంలో ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రొబేషన్ పూర్తి కాకముందే ఇలా నిరసనలు, విధులకు హాజరు కాకపోవడం వంటివి చేయకూడదు. కానీ తమ జీవితాలు, జీతాలకు సంబంధించిన అంశం కావడంతో సచివాలయ ఉద్యోగులు కాస్త ధైర్యం చేశారు. దీనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో చూడాలి. ముఖ్యంగా పీఆర్సీతో ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనలకు అడ్డుకట్ట వేసిన సీఎం జగన్, సచివాలయ ఉద్యోగులకు ఎలాంటి హామీ ఇస్తారో తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: