వారిద్దరూ చత్తీస్ ఘడ్ లోని బస్తర్ ఏరియాలో మావోయిస్ట్ దళంలో పనిచేస్తున్నారు. అతని పేరు కమ్లు పునేమ్, మిలీషియా ప్లటూన్ కమాండర్ గా పనిచేస్తున్నాడు. ఆమె పేరు మంగి. మిలీషియా గ్రూప్ లో సభ్యురాలు. వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ విషయం గ్రూపు సభ్యులకు కూడా తెలుసు. అయితే వారిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అంతే కాదు, వనవాసం ఆపేసి, వివాహం తర్వాత జన సమూహంలో కొత్త జీవితం గడపాలనుకున్నారు. ఈ విషయం చెబితే అగ్రనేతలు ఒప్పుకోరు కాబట్టి.. ఇద్దరూ మిలీషియా గ్రూప్ ని వదిలి పారిపోయారు.

సహజంగా ఇలాంటి సందర్భాల్లో మావోయిస్ట్ లు వారిని వెదికి పట్టుకుని కౌన్సెలింగ్ ఇచ్చి తిరిగి గ్రూపుల్లో చేర్చుకుంటారని సమాచారం. కానీ ఈసారి మాత్రం వారు కఠినంగా ఉన్నారు. అప్పటి వరకూ తమతో కలసి పనిచేసిన సహచరులు అని కూడా చూడకుండా వారిని మట్టుబెట్టారు. ఇదీ క్లుప్తంగా పోలీసులు మీడియాకు చెప్పిన కథనం. అయితే నిజంగా జరిగింది అదేనా, లేక పోలీసులే కట్టుకథ అల్లారా అనేది తేలాల్సి ఉంది. ఈ క్రమంలో మరో వ్యక్తిని కూడా మావోయిస్ట్ లు చంపేశారని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు.

చత్తీస్ ఘడ్ అడవుల్లోని బీజాపూర్ జిల్లా గంగులూరు సమీపంలో ఈ ఘటన జరిగింది. కమ్లుపై ఇప్పటికే 11 కేసులు ఉండగా, మంగి 3 పేలుడు ఘటనల్లో పాల్గొన్నట్టు చెబుతున్నారు పోలీసులు. మావోయిస్ట్ సహచరులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారనేది పోలీసులు చెబుతున్న కథనం. సహజంగా పోలీసు ఎన్ కౌంటర్ల తర్వాత ఇలాంటి వ్యవహారాలు బయటకు వస్తుంటాయి. వీటిని వెంటనే మావోయిస్ట్ వర్గాలు కూడా ఖండిస్తాయి. కానీ ఈ ఘటనపై మావోయిస్ట్ ల నుంచి స్పందన రావడం ఆలస్యం కావడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. మావోయిస్ట్ లు తమ సహచరుల్ని చంపుకునేంత కఠినంగా ఉంటారా, లేక పోలీసులే ఎన్ కౌంటర్ చేసి, ఇలా తప్పుదారి పట్టించడానికి చూస్తున్నారా అనేది తేలాల్సి ఉంది. దీనిపై పూర్తి వివరాలు బయటకు వస్తే కాని, పోలీసులు చెప్పిన దాంట్లో వాస్తవం ఎంతుందో తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: