కోవిడ్ మ‌హమ్మారి మ‌రోసారి విరుచుకుప‌డుతుండ‌టంతో దాని వ్యాప్తిని అరికట్టేదిశ‌గా ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌విష‌యం తెలిసిందే. దీనిపై ప్ర‌ధాని మోదీ స‌మీక్ష కూడా నిర్వ‌హించారు. 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో న‌మోదైన కొత్త కేసుల సంఖ్య 1.8 ల‌క్ష‌లుగా న‌మోదైంది. పాజిటివిటీ రేటు కూడా 13.3 శాతానికి చేరుకుని ప్ర‌మాధ ఘంటిక‌లు మోగిస్తోంది. దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ప‌లు మెట్రో న‌గ‌రాల్లో ఇప్ప‌టికే ఆంక్ష‌లు మొద‌ల‌య్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కోవిడ్ ఉధృత రూపం దాల్చ‌కుండా రాష్ట్ర‌ ప్ర‌భుత్వాలు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఏపీ ప్ర‌భుత్వం రాష్ట్రంలో రాత్రి పూట క‌ర్ఫ్యూ విధిస్తూ తాజాగా నిర్ణ‌యం తీసుకుంది. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఈ దిశ‌గా అధికారుల‌కు సోమ‌వారం ఆదేశాల‌ను జారీ చేశారు. రాత్రి 11 గంట‌ల నుంచి ఉద‌యం 5 గం. వ‌ర‌కు ఇది అమ‌ల్లో ఉండ‌నుంది. ఇక కోవిడ్ నియంత్ర‌ణ‌కు సంబంధించి పాటించాల్సిన  మార్గ ద‌ర్శ‌కాల‌ను కూడా ప్ర‌భుత్వం విడుద‌ల చేయ‌నుంది.

ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం వ్యాపార కూడ‌ళ్ల‌లో, జ‌న స‌మ్మ‌ర్థం ఉండే ప్రాంతాల్లో కోవిడ్ జాగ్ర‌త్త‌లు పాటించేలా చూడాలి, బ‌హిరంగ కార్య‌క్ర‌మాల్లో 200 మందికి, వేడుకలకు సంబంధించిన కార్య‌క్ర‌మాల్లో ఫంక్ష‌న్ హాళ్లు, ఇళ్ల వ‌ద్ద 100 మందికి మించి జ‌నం మించ‌కుండా జాగ్ర‌త్త‌పడాలి. సినిమా థియేట‌ర్ల‌లో ఉన్న సీట్ల సంఖ్య‌లో 50 శాతం మంది ప్రేక్ష‌కుల‌నే అనుమ‌తించాలి. ప్ర‌తి ఇద్ద‌రు ప్రేక్ష‌కుల మ‌ధ్య ఒక సీటు ఖాళీగా ఉంచాలి.  ప్ర‌యాణికులు  త‌ప్ప‌నిస‌రిగా  మాస్క్‌లు ధ‌రించాలి. ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేట‌పుడు ప్ర‌జ‌లంతా మాస్క్ ధ‌రించేలా చూసుకోవాలి. ఈ నిబంధ‌న‌లు పాటించేలా చూడాల‌ని అధికారుల‌కు ఇప్ప‌టికే ప్ర‌భుత్వం నుంచి దిశానిర్ధేశం చేసిన‌ట్టు తెలుస్తోంది. మ‌రోప‌క్క వ‌చ్చే రోజుల్లో వైద్య చికిత్స అవ‌స‌ర‌మ‌య్యే వారి సంఖ్య పెరిగినా ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఆక్సిజ‌న్, మందుల కొర‌త లేకుండా ఆసుప‌త్రుల్లో సిద్ధంగా ఉండాల‌ని కూడా వైద్య ఆరోగ్య శాఖ‌కు సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఆదేశాలు జారీ చేసిన‌ట్టు ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెపుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: