హిందీ బెల్ట్‌లో బ‌లం కాపాడుకుంటూనే ద‌క్షిణాదినా బ‌ల‌ప‌డేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న‌ బీజేపీ త‌న‌దైన శైలిలో వ్యూహాలు ర‌చిస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లోనూ ఇటీవ‌లికాలంలో జోరు పెంచింద‌ని జ‌రుగుతున్న ప‌రిణామాలు స్ప‌ష్టంగానే సూచిస్తున్నాయి. హిందూ ఓటు బ్యాంకును సంఘ‌టితం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ఆ పార్టీ ఎంచుకుంటున్న అంశాలు ఒక‌ప‌క్క‌ వివాదాస్ప‌ద‌మ‌వుతున్నా, విమ‌ర్శ‌ల‌కు గుర‌వుతున్నా ఆ పార్టీ ఎక్క‌డా వెన‌క్కుత‌గ్గ‌డం లేదు. తెలంగాణ‌లో టీఆర్ఎస్ ప్ర‌భుత్వంతో నిత్యం ఢీ అంటే ఢీ అంటున్న బీజేపీ ఏపీలోనూ పాగా వేసేందుకు మ‌త‌ప‌రంగా సున్నిత‌మైన అంశాల‌ను రాజ‌కీయంగా ఉప‌యోగించుకోవాల‌ని చూస్తుండ‌టం వైసీపీ ప్ర‌భుత్వానికి త‌ల‌నొప్పిగా మారింద‌నే చెప్పాలి. గుంటూరు న‌గ‌రంలోని జిన్నా ట‌వ‌ర్ పేరు మార్చాలంటూ ఇటీవ‌లే ఉద్య‌మ స్థాయిలో బీజేపీ హ‌డావిడి మొద‌లుపెట్టిన విష‌యం ఇంకా లైవ్‌లోనే ఉంది. ఇదిలా ఉండ‌గానే క‌ర్నూలు జిల్లా ఆత్మ‌కూరులో ఓ మ‌సీదు నిర్మాణం అంశంలో బీజేపీ నేతలు క‌లుగ‌జేసుకోవ‌డంతో అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్తాయి. అక్క‌డ త‌మ‌పై దాడి చేశారంటే త‌మ‌పైనే చేశారంటూ రెండు వ‌ర్గాలూ ప‌ర‌స్ప‌రం ఆరోప‌ణ‌లు చేసుకున్నాయి.

దీంతో మ‌త‌ప‌ర‌మైన సున్నిత అంశాల‌ను రెచ్చ‌గొడితే ఎవ‌రిపైనైనా చ‌ర్య‌లు తప్ప‌వ‌ని ఏపీ డీజేపీ గౌత‌మ్ స‌వాంగ్ ప్రెస్ మీట్ పెట్టి మరీ హెచ్చ‌రించాల్సి వ‌చ్చింది. అయితే బీజేపీ నేత‌లు మాత్రం దీనిని రాజ‌కీయ‌ప‌రంగా త‌మ‌కు ల‌బ్ధి చేకూర్చే అంశంగా మాత్ర‌మే చూస్తున్నారు. ఆత్మ‌కూరులో త‌మ పార్టీ నేత‌ల‌పై దాడి చేసినవారిని అరెస్టు చేయాలంటూ రాష్ట్ర‌వ్యాప్తంగా ఆ పార్టీ నేత‌లు నిరస‌న‌లకు దిగారు. విజ‌య‌వాడ‌లో జ‌రిగిన ఆందోళ‌న కార్య‌క్ర‌మంలో ఆ పార్టీ ఎంపీ సీఎం ర‌మేష్‌, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ త‌దిత‌రులు పాల్గొన్నారు. అంతేకాదు.. ఏపీ పోలీస్ వ్య‌వ‌స్థ‌పైనా తీవ్ర విమ‌ర్శ‌లకు దిగారు. అధికార పార్టీకి తొత్తుగా ఏపీ పోలీస్ వ్య‌వ‌స్థ వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని, ఏపీలో దేవాల‌యాల‌పై దాడులు స‌హా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను కేంద్రం నిశితంగా ప‌రిశీలిస్తోంద‌ని హెచ్చ‌రించారు. బీజేపీ నేత‌ల వ్యాఖ్య‌లు చూస్తుంటే ఏపీలో వ‌చ్చే రోజుల్లో ఆస‌క్తిక‌ర‌మైన రాజ‌కీయ ప‌రిణామాలు సంభ‌వించే అంశాన్ని కొట్టిపారేయ‌లేమ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: