చంద్రబాబునాయుడును చూస్తుంటే జాలేస్తోంది. 2019లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుండి ఏమి మాట్లాడినా ఆవు వ్యాసం లాగ చివరకు జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలి, ప్రభుత్వాన్ని రద్దు చేయాలి, ఎంఎల్ఏలతో రాజీనామాలు చేయించి మధ్యంతర ఎన్నికలకు సిఫారసు చేయాలనే డిమాండ్లే చేస్తున్నారు  చంద్రబాబు. గడచిన రెండున్నరేళ్ళల్లో జగన్ రాజీనామా కోసం చంద్రబాబు కనీసం వందసార్లైనా డిమాండ్ చేసుంటారు.




బంపర్ మెజారిటితో అధికారంలోకి వచ్చిన జగన్ ఎందుకు రాజీనామా చేస్తారన్న సోయి కూడా చంద్రబాబులో లేకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. తాజాగా ‘ధరలు దిగిరావాలి..జగన్ రాజీనామా చేయాలి’ అనే డిమాండ్ తో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని పిలుపిచ్చారు. ధరలు తగ్గించాలని డిమాండ్ చేయటంలో తప్పులేదు కానీ రాజీనామా డిమాండ్ ఎందుకో అర్ధం కావటంలేదు. పదే పదే జగన్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారంటేనే అర్జంటుగా తాను సీఎం అయిపోవాలనే కోరిక చంద్రబాబులో ఎంత బలంగా ఉందో అర్ధమైపోతోంది.




ప్రజాస్వామ్య బద్దంగా జరిగిన ఎన్నికల్లోనే జగన్ అధికారంలోకి వచ్చారు. 2019లో జరిగిన ఎన్నికలు మళ్ళీ 2024లో మాత్రమే జరుగుతాయి. అప్పటివరకు చంద్రబాబు వెయిట్ చేయకతప్పదు కదా. మరింతలోనే జగన్ రాజీనామా చేయాలనే గోల ఎందుకు చేస్తున్నట్లు ? ఎవరెంత అరిచి గీ పెట్టినా జగన్ రాజీనామా చేయరని అందరికీ తెలిసిందే. తాను అధికారంలో ఉన్నపుడు ఎప్పుడైనా చంద్రబాబు రాజీనామా చేశారా ? తాను చేయని రాజీనామాను జగన్ నుండి ఎలా ఆశిస్తారు ?




అమిత్ షా కాన్వాయ్ మీద తిరుమలలో దాడి జరిగినపుడు, నరేంద్రమోడీ పర్యటనలో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపినపుడు బీజేపీ వాళ్ళు రాజీనామా డిమాండ్ చేస్తే చంద్రబాబు చేశారా ? అధికారంలో ఉన్నవాళ్ళు ఎవరూ రాజీనామా చేయరు. మరీ విషయంలో బాగా అనుభవం ఉన్న చంద్రబాబు పదే పదే రాజీనామా డిమాండ్లు చేసి జనాల్లో పలచనవుతున్నారంతే.  ఏదో భ్రమల్లో కాకుండా వాస్తవంలోకి వస్తే చంద్రబాబుకే మేలు. లేకపోతే అంతే సంగతులు.

మరింత సమాచారం తెలుసుకోండి: