ఎమ్మెల్యేలు ఎవరికి వారే ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, లేనిపోని అనర్థాలు కొనితేవడం సీఎం జగన్ కి సుతరామూ ఇష్టం లేదు. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారంటే దానికో అర్థముంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని తిట్టే క్రమంలో మధ్యలో సినిమావాళ్లపై శివాలెత్తారు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి. దీంతో అటు నిర్మాతల మండలి కూడా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బలిశారు అనే పదం బాగోలేదని ఎమ్మెల్యే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు నిర్మాతలు. తెలుగు సినిమా సక్సెస్ రేటు 2 నుంచి 5 శాతం మాత్రమేనని, అందరు నిర్మాతలు ఆర్థికంగా బాగోలేరని, కొంతమంది కేవలం నిర్మాతల మండలి ఇచ్చే పింఛన్ పై ఆధారపడి బతుకుతున్నారని వారు ఓ లేఖ విడుదల చేశారు. ప్రజా ప్రతినిధి అయిఉండి కూడా నిజానిజాలు తెలుసుకోకుండా ఇలా మాట్లాడటం సరికాదన్నారు.

ఈ క్రమంలో ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యల వ్యవహారంపై సీఎం జగన్ ఆరా తీసినట్టు తెలుస్తోంది. నేరుగా ఎమ్మెల్యేతోనే ఆయన ఫోన్లో మాట్లాడారని, ఇంకెప్పుడు అలా అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని చెప్పారని అంటున్నారు. ఈ మాటల్లో వాస్తవం ఉందో లేదో తెలియదు కానీ.. గతంలో జగనన్న కాలనీల విషయంలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై మాత్రం అప్పట్లో జగన్ కాస్త ఘాటుగానే ఆయనకి క్లాస్ తీసుకున్నారట. పేదవారికోసం నిర్మిస్తున్న జగనన్న కాలనీల్లో ఇంటి విస్తీర్ణం సరిపోదని ఎమ్మెల్యే ప్రసన్న కాస్త వ్యంగ్యంగా స్పందించారు. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యేనే జగనన్న కాలనీలపై కామెంట్ చేశారని, ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించాలని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. దీంతో వైసీపీ ఇరుకునపడినట్టయింది.

గతంలో సినిమా వాళ్లు వరద బాధితులకు సాయం చేయడంలేదని మండిపడ్డ ఎమ్మెల్యే ప్రసన్న.. ఇప్పుడు ఏకంగా వారిని బలిసేలా చేసింది చంద్రబాబు అంటూ సెటైర్లు వేశారు. దీంతో సినిమా వాళ్లు ఈ వ్యాఖ్యలతో నొచ్చుకున్నారు. సినిమావాళ్లంతా డబ్బున్నవారని అనడం సరికాదని నిర్మాతల మండలి క్లారిఫికేషన్ ఇచ్చింది. అయితే ఎమ్మెల్యే ప్రసన్న, స్టార్ హీరోలని ఎక్కువగా టార్గెట్ చేస్తే, ఇక్కడ నిర్మాతల మండలి అనూహ్యంగా తెరపైకి రావడం విశేషం. ఈ ఎపిసోడ్ లో ఎమ్మెల్యేకి జగన్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారనేదే ఇప్పుడు హాట్ టాపిక్.

మరింత సమాచారం తెలుసుకోండి: