కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువైన దివ్య క్షేత్రం తిరుమల. నిత్యం గోవిందుని నామస్మరణతో తిరుమల గిరులు మారు మోగుతుంటాయి. ఇక ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే శ్రీవారిని దర్శించుకుంటే చాలు... అన్ని తొలగిపోతాయని భక్తుల నమ్మకం. నిత్యం వేల మంది భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకుంటున్నారు. ఇక దేవదేవుని దర్శన భాగ్యం కోసం ప్రపంచ వ్యాప్తంగా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు కూడా. అయితే 2020 మార్చి నెల 18వ తేదీ నుంచి తిరుమల గిరుల్లో ఆంక్షల విధించారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దాదాపు రెండు నెలల పాటు భక్తుల రాకను నిషేధించారు. ఆ తర్వాత కూడా రోజుకు కేవలం 4 వేల మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కాస్త కుదుటుపడుతుంటంతో... భక్తుల సంఖ్యను పెంచింది టీటీడీ. కానీ మళ్లీ ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో థర్డ్ వేవ్ రావడంతో.. టీటీడీ అలర్ట్ అయ్యింది.

ఈ నెల 13వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల వాసుని దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పండుగల రోజున భక్తులు పెద్ద ఎత్తున స్వామిని దర్శించుకుంటారు. దీంతో టీటీడీ కూడా భక్తుల విజ్ఞప్తి మేరకు దాదాపు లక్ష మందికి దర్శన భాగ్యం కలిగించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఉచిత టోకెన్ల జారీ ప్రక్రియ కూడా పూర్తి చేశారు అధికారులు. ఇక ఇటీవల భారీ వర్షాలకు దెబ్బ తిన్న రెండో ఘాట్ రోడ్డు పనులను కూడా అధికారులు పూర్తి చేసి రాకపోకలకు అనుమతి ఇచ్చారు. అయితే కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో టీటీడీ ముందస్తు జాగ్రత్తలు పాటించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఒక్కరు తప్పని సరిగా మాస్కు ధరించాలని ఆదేశించింది. అలాగే భౌతిక దూరం పాటించాలని... శానిటైజర్ తప్పని సరిగా వాడాలని కూడా సూచించింది. ఇక ఏ మాత్రం కొవిడ్ లక్షణాలు ఉన్నా కూడా... తిరుమల ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. ఇక కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్, వాక్సినేషన్ సర్టిఫికెట్ ఉంటేనే తిరుమలకు అనుమతించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అలిపిరి టోల్ గేట్ వద్దే ఇవి చూపించాల్సి ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: