లాక్ డౌన్ హీరోగా పేరు తెచ్చుకున్న సోనూ సూద్ ఇప్పుడు కష్టాల్లో పడ్డట్టయింది. ఆయన పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవడంతో సోనూ కూడా విమర్శల ధాటిని తట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సోనూ సూద్ సోదరి మాళవిక పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. మోగా నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేస్తారని సమాచారం. ఈ క్రమంలో ఆమె అక్కడ ప్రచార కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. ఆ కార్యక్రమాలకు సోనూ సూద్ కూడా హాజరవుతున్నారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది. సోనూ సూద్ కూడా ఇప్పటి వరకూ ఎలాంటి ఇబ్బంది పడలేదు. ఎందుకంటే ఆయన మెడలో ఏ పార్టీ కండువా లేదు కాబట్టి.

కాంగ్రెస్ కండువా పడినట్టేనా..?
సోనూ సూద్ మెడలో కాంగ్రెస్ నేతలు కండువా వేయలేదు కానీ.. ఆయన సోదరి మాళవికను మాత్రం హస్తం పార్టీలో చేర్చుకున్నారు. ఈ కార్యక్రమానికి సోనూ సూద్ కూడా హాజరు కావడం విశేషం. పంజాబ్ సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ, పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ సమక్షంలో మాళవిక కాంగ్రెస్ లో చేరారు. అయితే అధికారికంగా సోనూ సూద్ మాత్రం ఆ పార్టీలో చేరలేదు.


 సోనూ సూద్ కాంగ్రెస్ మనిషే..
సోనూ సూద్ కాంగ్రెస్ లో చేరలేదు కానీ, కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న తన సోదరికోసం మాత్రం ఆయన బయటకు రావాల్సిందే, ప్రచారం చేయాల్సిందే. అంటే బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ, కాంగ్రెస్ ని పొగుడుతూ సోనూ పొలిటికల్ స్టేజ్ లపై డైలాగులు చెప్పాల్సిన సందర్భం వచ్చింది. మాళవిక ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే సోనూకి ఈ ఇబ్బందులు ఉండేవి కావు, కానీ ఆమె కాంగ్రెస్ లో చేరడంతో.. సోనూపై కూడా రాజకీయ పార్టీ ముద్ర పడిపోయినట్టే లెక్క.

ఇప్పటి వరకూ సోనూ సూద్ సేవా కార్యక్రమాలే హైలెట్ అయ్యాయి. ఇకపై ఆయన పొలిటికల్ పంచ్ డైలాగులు కూడా హైలెట్ కాబోతున్నాయి. సోనూ సూద్ రాజకీయ విమర్శలలోకి దిగితే... ఆయనపై కూడా విమర్శలు ఎక్కు పెట్టేందుకు పార్టీలు, నేతలు సిద్ధంగా ఉన్నారు. అంటే ఒకరకంగా ఇప్పటినుంచి సోనూకి కష్టకాలం మొదలైనట్టే లెక్క. విమర్శలు చేయాలి, విమర్శలను కాచుకోవాలి. అందరి వాడు అనిపించుకున్న సోనూ సూద్.. ఇక కాంగ్రెస్ వాడు అనే ముద్ర వేయించుకోబోతున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: