సంక్షేమ కార్యక్రమాల అమలులో, వివిధ రకాల నూతన అభివృద్ధి కార్యక్రమాలను పట్టాలెక్కించడంలో దేశంలోనే కొత్త ఒరవడి సృష్టించారని ఏపీ సీఎం జగన్ కి పేరుంది. ఏపీలోని సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థను ఇతర రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి అక్కడి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయడమే దీనికి పెద్ద ఉదాహరణ. అయితే అన్నిట్లోనూ ముందుంటున్న జగన్, కొన్ని విషయాల్లో మాత్రం పక్క రాష్ట్రాల సీఎంల కంటే వేగంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆయన అలాంటి కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు ఆలోచిస్తున్నారు.

తమిళనాడులో ఆంక్షలు కఠినం..
ఏపీకంటే ముందు తమిళనాడులో కొవిడ్ ఆంక్షలు కఠినం అయ్యాయి. నైట్ కర్ఫ్యూతోపాటు, వీకెండ్ కర్ఫ్యూతో అక్కడి సీఎం స్టాలిన్ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఇటీవల వీకెండ్ కర్ఫ్యూ సక్సెస్ అయిందని అంటున్నారు. అంతే కాదు, ప్రజా రవాణాపై కూడా ఆంక్షలు విధించారు. ఇటు ఏపీలో మాత్రం ప్రస్తుతానికి నైట్ కర్ఫ్యూ మాత్రమే అమలులోకి వచ్చింది.

పండగ సందడిపై ఆంక్షలు..
తమిళనాడులో జనవరి 16న పూర్తిగా లాక్ డౌన్ అమలులో ఉంటుంది. జనవరి 31 వరకు సాధారణ ఆంక్షలను కూడా పొడిగించారు. ఈ దశలో ఏపీలో మాత్రం పండగ సందడిపై ఇంకా ఆంక్షలు పెట్టలేదు. వీకెండ్ కర్ఫ్యూపై కూడా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోలేదు. అయితే కేసులు మాత్రం పెరుగుతుడంటం కాస్త ఆందోళన కలిగించే విషయం. మొత్తమ్మీద కఠిన ఆంక్షలతో కరోనాపై కొరడా ఝళిపించడంలో తమిళనాడు సీఎం స్టాలిన్ బాగా ముందుంటే, ఆయన వెనక ఏపీ సీఎం జగన్ ఉన్నారు, ఆ తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నారని అర్థమవుతోంది.

దక్షిణాదిన భారీగా పెరుగుతున్న కేసులు..
ఉత్తరాదితోపాటు, దక్షిణాదిన కూడా ఈ దఫా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. టీకాల విషయంలో ఏపీ ముందున్నా కూడా కొత్తగా కేసులు పెరగడం ఆందోళన కలిగించే విషయం. అయితే ఏపీలో ఒమిక్రాన్ భయాలు పెద్దగా లేకపోయినా కొవిడ్ కేసుల్లో మాత్రం పెరుగుదల కనిపిస్తోంది. త్వరలో జగన్ ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: