దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న కారణంగా ఐసీఎమ్ఆర్ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఒకరికి కరోనా పాజిటివ్ గా తేలి కాంటాక్ట్ అయిన వ్యక్తులకు ఎలాంటి లక్షణాలు , వయసు పైబడి ఇతర అనారోగ్య సమస్యలు లేకపోతే వారికి కరోనా టెస్టులు నిర్వహించాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ఇక బీపీ, షుగర్, ఊపిరితిత్తుల సమస్యలు, కిడ్నీ, ఇతర ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఖచ్చితంగా టెస్టులు చేయాలని సూచించింది.

మరోవైపు ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60సంవత్సరాల వయసు దాటిన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి బూస్టర్ డోస్ తీసుకునేందుకు కేంద్రం అనుమతిచ్చింది. దేశంలో 8కంపెనీల కోవిడ్ వ్యాక్సిన్లకు అనుమతి ఉండగా.. బూస్టర్ డోస్ తీసుకునేందుకు కోవాగ్జిన్, కోవీషీల్డ్, స్పూత్నిక్ వి వ్యాక్సిన్లనే కేంద్రం అనుమతిచ్చింది. అటు మిక్స్ డ్ డోసులకు అనుమతి ఇవ్వలేదు.. కాబట్టి గతంలో ఏ వ్యాక్సిన్ తీసుకుంటే ఇప్పుడు అదే వ్యాక్సిన్ తీసుకోవాలి.

ఇక కరోనా విషయంలో రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. యాక్టివ్ కేసుల్లో 5శాతం నుండి 10శాతం మందికి ఆస్పత్రి అవసరమవుతుందని అభిప్రాయపడింది. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. కోవిడ్ రోగులను తరలించేందుకు అంబులెన్సులను సిద్ధం చేయాలంది. జిల్లా ఆస్పత్రులను టెలీ కన్సల్టేషన్ హబ్ లుగా వాడాలని తెలిపింది. అధిక ఫీజు వసూలు చేసే క్లినిక్ లపై చర్యలు తీసుకోవాలని సూచించింది కేంద్ర ప్రభుత్వం. వ్యాక్సినేషన్ సమయం ఉదయం 8గంటల నుంచి రాత్రి 10గంటల వరకు పెంచింది.

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు, పాజిటివిటీ రేటు భారీగా పెరుగుతోంది. ఈ కారణంగా అక్కడ మరిన్ని ఆంక్షలు విధించారు. ప్రస్తుతం 50శాతం సామర్థ్యంతో పనిచేస్తున్న రెస్టారెంట్లు, బార్లను పూర్తిగా మూసివేస్తూ.. టేక్ అవేలకు మాత్రమే అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేట్ ఉద్యోగులందరికీ వర్క్ ఫ్లమ్ హోమ్ ఇవ్వాలని ఆదేశించారు. అలాగే మెట్రో రైళ్లు, బస్సుల్లో సీటింగ్ సామర్థ్యం మళ్లీ తగ్గించాలని నిర్ణయించారు.మరింత సమాచారం తెలుసుకోండి: