ఇప్పటికే జనం కరోనాతో నానా ఇబ్బందులు పడుతుంటే.. ఇప్పుడు కొత్తగా మరికొన్ని ఆరోగ్య ఇబ్బందులు వస్తున్నాయి.. వాటిలో ఫ్లూరోనా ఒకటి.. అయితే.. ఇది కొత్త జబ్బేమీ కాదు.. ఫ్లూతో పాటు కరోనా వస్తే దాన్ని ఫ్లూరోనా అని పిలుస్తున్నారు. అంటే ఒకేసారి ఫ్లూ, కరోనా రావడం అన్నమాట.. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది జంట ఇన్‌ఫెక్షన్‌. ఇప్పుడు ఈ రకం కేసులు వెలుగు చూస్తున్నాయి. ఓవైపు ఒమిక్రాన్ సతాయిస్తుంటే ఇప్పుడు ఫ్లూరోనా కేసులు కలవరపెడుతున్నాయి.


కరోనా, ఫ్లూ రెండూ కూడా శ్వాసకోశ సమస్యలు. ఈ రెండు ఊపిరితిత్తులపై దాడి చేస్తాయి. వీటి లక్షణాలు కూడా ఒకేలా ఉంటాయి. జ్వరం, ముక్కు కారటం, ఆకలి తగ్గటం, గొంతునొప్పి, ఒళ్లునొప్పులు, దగ్గు, తుమ్ములు ఇవన్నీ కామన్.. వీటితో పాటు రెండింటిలోనూ  తలనొప్పి, నిస్సత్తువ ఉంటాయి. అలాంటిది ఇప్పుడు ఈ రెండూ కలసి వస్తున్నాయి. ఇంకో ఆశాజనకమైన విషయం ఏంటంటే.. ఈ రెండు కలిసి వచ్చినా ఎక్కువగా ఇబ్బంది పెట్టడం లేదు.


మరి చిక్కు ఎక్కడ వస్తోందంటే.. ఇప్పటి వరకూ టీకా తీసుకోని వారికి ఈరెండూ కలిసి వస్తే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. తీవ్ర పరిణామాలు కూడా  తలెత్తవచ్చు. ఎందుకంటే.. ఈ రెండు కలిస్తే న్యుమోనియా వచ్చే ప్రమాదం ఉంది. అదే జరిగితే ఊపిరితిత్తుల్లోని కణజాలం, గాలిగదులు ఉబ్బిపోతాయి. రోగి పరిస్థితి విషమిస్తుంది. ఇక అప్పడు రోగికి  కృత్రిమ శ్వాస కల్పించాల్సిన అవసరం వస్తుంది.


కరోనాతో పోలిస్తే ఫ్లూ వైరస్‌తో కూడా గుండె, కండరాలు, మెదడులో వాపు రావచ్చు.  ఫ్లూరోనా వల్ల రెండు వైరస్‌లు ఒకేసారి దాడి చేయడం వల్ల రోగనిరోధకవ్యవస్థపై ఒత్తిడి బాగా పెరుగుతుంది. అయితే ఈ ఫ్లూరోనాను గుర్తించడం కూడా కష్టమే. రెండింటి పరీక్షలు చేస్తే తప్ప దీన్ని నిర్థారణ చేయలేం. ఫ్లూ జ్వరాలు చాలా మందిలో ఇబ్బంది పెట్టకుండానే తగ్గిపోతుంటాయి. అయితే..  వృద్ధులు, గర్భిణులు, పిల్లలకు ఈ ఫ్లూ ప్రమాదకరం కావచ్చు. ఇక ఫ్లూతో పాటు కరోనా కూడా వస్తే పరిస్థితి మరింత దిగజారొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: