ఉభయ కమ్యూనిస్టులు కారెక్కేందుకు రంగం సిద్ధమైందా..  గులాబీ కారు ఎరుపెక్కనుందా? టీఆర్ఎస్ చీఫ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారా ? రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న విషయాన్ని కెసిఆర్ మరోసారి నిరూపించారు. కాలపరీక్షలో గతాన్ని పట్టుకు కూర్చోకుండా తమను ఎవరూ ఆడనంత ఎటకారం ఆడేసిన వారితోనూ భుజం భుజం కలపడంలో బ్రహ్మాండమైన ట్రాక్ రికార్డు ఉన్న కామ్రేడ్లు అలాంటి తీరును మరోసారి ప్రదర్శించారు.

 కమ్యూనిస్టులను సీఎం కేసీఆర్ ఎంతలా వాడేస్తారో అందరికీ తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన వాడేసే వైనం ఎలా ఉంటుందో అర్థమయ్యేలా ప్రగతి భవన్ లో తాజా సన్నివేశం ఉంది. ఒకప్పుడు తనను కలవడానికి వచ్చిన కమ్యూనిస్టు అగ్రనేతల్ని గంటలకొద్దీ వెయిట్ చేయించిన కేసీఆర్ ఇప్పుడు ఆ విషయాన్ని మర్చిపోయి మరీ తన ఇంటికి స్వయంగా పిలవడమే కాదు, తన ఇంటికి వచ్చిన వారిని సాదరంగా  ఆహ్వానించారు. అదే సమయంలో తమ పార్టీ ముఖ్య నేతలకు గతంలో ఎదురైనా ఆహ్వానాన్ని లైట్ తీసుకున్న కమ్యూనిస్టులు అలాంటివేవీ మనసులో పెట్టుకోకుండా ప్రగతి భవన్ కు వెళ్లి కేసీఆర్ తో పాలలో నీళ్ళ మాదిరి కలిసిపోయారు. బొకేలు ఇచ్చిపుచ్చుకోవడం తో పాటు తాజా రాజకీయ పరిణామాలపై నిశితంగా  చర్చలు జరిపారు. దేశంలో మతోన్మాద బీజేపీ పాలనను కూకటివేళ్లతో పెకలించి వేయాల్సిన అవసరం ఉందన్న వాదనను సిపిఎం,సిపిఐ అగ్రనేతలు వినిపించడం అందుకు తగ్గట్లే బీజేపీ మీద కత్తి పట్టిన కెసిఆర్ సైతం కమ్యూనిస్టుల మాటలను బలపరిచారు. తాజాగా హైదరాబాద్ లో సిపిఎం కేంద్ర కమిటీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్ వచ్చిన సిపిఎం అగ్రనేతలు సీఎం కేసీఆర్ ను కలిశారు.

ఈ భేటీలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ తదితరులు హాజరయ్యారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము పని చేస్తున్నామని ఈ విషయంలో దేశంలోని భావసారూప్యత కలిగిన ప్రగతిశీల పార్టీలు, శక్తులన్నీ ఏకం కావాలని ఒకే వేదిక మీదకు రావాల్సిన అవసరం ఉందన్న ఆకాంక్ష వ్యక్తమయింది. ఇద్దరు సీఎంలు జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం. మరి టీ రాజకీయాలు ఏ దిశగా టర్న్ తీసుకోనున్నాయో వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: