చిన్నతరహా యూనిట్లు స్థాపించుకొని సొంతకాళ్లపై నిలబడాలనుకొనే వారికోసం ప్రవేశపెట్టిన టీ-ఐడియా, టీ-ప్రైడ్‌ పథకాలు విజయవంతంగా ముందుకు సాగుతున్నాయి. రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఈ పథకాల ద్వారా దాదాపు 67 వేల మందికి రాయితీల కింద రూ.4,800 కోట్ల వరకు ప్రభుత్వం సహాయం అందించింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెం టనే పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయటం ద్వారా ప్రైవేటురంగంలో ఉద్యోగ, ఉపాధి కల్పనపై దృష్టి పెట్టింది. జనరల్‌ క్యాటగిరీ అభ్యర్థులకు టీ-ఐడియా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు టీ-ప్రైడ్‌ పేరుతో రెండు పథకాలకు రూపకల్పన చేసింది. తెలంగాణ స్టేట్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూవర్‌ అడ్వాన్స్‌మెంట్‌(టీ-ఐడియా) పథకం ద్వారా పరిశ్రమలు స్థాపించే జనరల్‌ క్యాటగిరీ అభ్యర్థులకు వివిధ రకాల ప్రోత్సాహకాలు కల్పిస్తున్నది. పెట్టుబడి రాయి తీ, ల్యాండ్‌ కాస్ట్‌, స్టాంప్‌ డ్యూటీ, ఎస్‌జీఎస్‌టీ, పవర్‌కాస్ట్‌ రీయింబర్స్‌మెంట్‌తోపాటు పావలా వడ్డీ రాయితీలు ఇస్తున్నది.


ఆన్‌లైన్‌ ద్వారా వీటిని పారదర్శకంగా మంజూరు చేస్తున్నది. 35 నుంచి 40 శాతం వరకు అభ్యర్థులకు రాయితీలు లభిస్తున్నాయి. తెలంగాణ స్టేట్‌ ప్రోగ్రాం ఫర్‌ ర్యాపిడ్‌ ఇంక్యుబేషన్‌ ఆఫ్‌ దలిత్‌ ఇంటర్‌ప్రెన్యూవర్స్‌ (టీ-ప్రైడ్‌) ద్వారా ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ వర్గాల పారిశ్రామికవేత్తలకు రాయితీలతోపాటు పారిశ్రామికవాడల్లో రిజర్వేషన్‌ ప్రకారం ప్లాట్లు రిజర్వు చేస్తున్నది. టీ-ఐడియాలో జనరల్‌ క్యాటగిరీ అభ్యర్థుల మాదిరిగానే అన్నిరకాల రాయితీలు కల్పిస్తున్నది. రీయింబర్స్‌మెంట్‌ కాకుండా డైరెక్ట్‌ ఫండింగ్‌, మార్జిన్‌మనీ రూపంలో, అదనపు పెట్టుబడి రాయితీలు కూడా ఇస్తున్నది. మహిళా పారిశ్రామికవేత్తలకు అదనపు ప్రోత్సాహకాలు కల్పిస్తున్నది. వీరికి యూనిట్‌ను బట్టి 45 నుంచి 70 శాతం రాయితీ లభిస్తున్నది.


నిరుద్యోగ యువతను సొంతకాళ్లపై నిలబెట్టాలన్నదే లక్ష్యం

నిరుద్యోగ యువత కుంగిపోకుండా సొంతకాళ్లపై నిలబడి ఆత్మగౌరవంతో బతకాలనే లక్ష్యంతో ప్రభుత్వం టీ-ఐడియా, టీ-ప్రైడ్‌ పథకాలను అమలుచేస్తున్నది. అభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేయాలన్న సీఎం కేసీఆర్‌ మహోన్నత ఆశయం మేరకు బలహీనవర్గాలకు అదనంగా రాయితీలు కల్పిస్తున్నాం. గ్రామాలు, చిన్న పట్టణాల్లో చిన్నతరహా వ్యాపారాలు, యూనిట్లు పెట్టుకొని వారు ఉపాధి పొందడమేకాకుండా నలుగురికి ఉపాధి కల్పించే విధంగా ఈ పథకాలు దోహదపడుతున్నాయి. – కే తారకరామారావు, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి

మరింత సమాచారం తెలుసుకోండి:

ktr