ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ - apsrtc అధికారులు ప్రజల సెంటిమెంట్‌ను క్యాష్‌ చేసుకోవడంలో ముందున్నారు. ఏపీకి చెందిన చాలా మంది హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఉద్యోగ రీత్యా, విద్యాభ్యాసం వంటివి చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగువారికి పెద్ద పండుగ అయిన సంక్రాంతికి కోస్తా ప్రాంతం వారు అధిక ప్రాధాన్యత ఇస్తారు. పొరుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో ఏ మూల ఉన్నా.. సంక్రాంతి పండుగకు కచ్చితంగా స్వస్థలాలకు చేరుకుంటారు. సంక్రాంతి పండుగ వేళ కుటుంబ సభ్యుల మధ్య సంతోషంగా గడపాలని కోరుకుంటారు. సంవత్సరం పొడవునా ఎంత కష్టపడినా... సంక్రాంతి సమయంలో అయినవారితో ఆనందంగా ఉండి సేదతీరాలని కాంక్షిస్తారు. ఈ సెంటిమెంట్‌ సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తోంది. రాష్ట్ర విభజన జరిగినా తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రావారిలో ఈ సెంటిమెంట్‌ కంటిన్యూ అవుతోంది. ఇందులో భాగంగానే తెలంగాణ నుంచి ఏపీకి వచ్చే వారంతా ఎక్కువగా ఏపీఎస్‌ఆర్‌టీసీలో ప్రయాణించడానికి మొగ్గు చూపుతారు. ఇప్పుడిదే సెంటిమెంట్‌ను ఏపీఎస్‌ఆర్‌టీసీ అధికారులు అనుకూలంగా మార్చుకుని ప్రయాణికులపై చార్జీల మోత మోగిస్తున్నారు.

ఏపీఎస్‌ఆర్‌టీసీ ఆదివారం నుంచి ప్రారంభించిన పండుగ స్పెషల్‌ బస్సు సర్వీసుల్లో 50 శాతం ఛార్జీలు ఆదనంగా వసూలు చేస్తున్నారు. టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయటం లేదని తెలంగాణ ఉన్నతాధికారులు ప్రకటించగా.... 50 శాతం అదనపు ఛార్జీలు తప్పటం లేదంటూ ఎపీఎస్‌ఆర్‌టీసీ ఉన్నతాధికారులే తెలిపారు. స్పెషల్‌ బస్‌ ఛార్జీలతో ప్రజలపై భారం మోపుతున్నారు.

తెలంగాణ బస్సుల్లో హైదరాబాద్‌ నుంచి విజయవాడకు గరుడ ప్లస్‌ బస్సుల్లో రూ.651, సెమీ స్లీపర్‌ 'రాజధాని' బస్సులో రూ.546, నాన్‌ ఏసీ శ్రేణి సూపర్‌ లగ్జరీ బస్సులో రూ.426 వసూలు చేస్తున్నారు. ఇక విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లే ఏపీఎస్‌ఆర్‌టీసీ ఏసీ శ్రేణి బస్సుల విషయానికి వస్తే.. అమరావతి, డాల్ఫిన్‌ బస్సుల్లో సాధారణ చార్జీ రూ.564 ఉండగా... స్పెషల్‌ చార్జీ 50 శాతం కలిపి మొత్తం రూ.846 వసూలు చేస్తున్నారు. అలాగే గరుడ బస్సుల్లో రూ.759, సూపర్‌ లగ్జరీ బస్సుల్లో రూ.550, వెన్నెల స్లీపర్‌ బస్సుల్లో రూ. 1066 చొప్పున ప్రయాణికులు చెల్లించాల్సి వస్తోంది. ఇక విజయవాడ నుంచి హైదరాబాద్‌కు నడిచే నైట్‌ రైడర్‌ బస్సులో రూ.762 మేర చార్జి వసూలు చేస్తున్నారు. మొత్తంమీద ఏపీ బస్సుల్లో అదపున చార్జీల కారణంగా ప్రయాణికులు దోపిడీకి గురవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: