యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ గెలిచి అధికారాన్ని నిలుపుకోవ‌డంతో పాటు, దేశవ్యాప్తంగా బ‌ల‌ప‌డి వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌పై దృష్టి సారించే ప్ర‌య‌త్నంలో ఉన్న బీజేపీకి కీల‌క‌మైన రాష్ట్రంలోనే గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగీ ఆదిత్య‌నాథ్ మంత్రివ‌ర్గంలోని స్వామిప్ర‌సాద్ మౌర్య త‌న ప‌ద‌వితో పాటు పార్టీ స‌భ్య‌త్వానికి కూడా మంగ‌ళ‌వారం రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డంతో బీజేపీ షాక్ తింది. మ‌రో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా మంత్రి బాట‌లోనే రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డంతో ఇంకెన్ని అసంతృప్త స్వ‌రాలు బ‌య‌ట ప‌డ‌తాయోన‌నే ఆందోళ‌న ఆ పార్టీని ఆవ‌రించింది. రాజ‌కీయ‌వ‌ర్గాల‌తో పాటు సామాన్య ప్ర‌జ‌ల్లో కూడా ఈ ప‌రిణామాలు ఇప్పుడు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. బీజేపీని వీడిన నాయ‌కులంతా త్వ‌ర‌లోనే అఖిలేష్ యాద‌వ్ నేతృత్వంలోని స‌మాజ్‌వాదీ పార్టీలో చేర‌బోతున్న‌ట్టు సంకేతాలందుతున్నాయి.

గ‌తంలో బీఎస్పీ నేత‌గా ఉన్న స్వామిప్ర‌సాద్ మౌర్య 2017 ఎన్నిక‌ల ముందు బీజేపీలో చేరారు. ప‌ద్రౌనా స్థానం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బ‌ల‌మైన నేత‌గా ఆయ‌న‌కు గుర్తింపు ఉంది. ఓబీసీ వ‌ర్గాల్లో ఆయ‌న‌కు గ‌ట్టి ప‌ట్టుంది. ఈ ప‌రిణామం యూపీలో 20 శాస‌న‌స‌భ స్థానాల ఫ‌లితాల‌పై గ‌ట్టి ప్ర‌భావం చూప‌వ‌చ్చ‌న్న అంచ‌నాలున్నాయి. ఇక త‌న రాజీనామాకు రైతులు, ద‌ళితులు, ఓబీసీలు, నిరుద్యోగులు స‌హా పేద వ‌ర్గాల‌పై బీజేపీ ప్ర‌భుత్వం అణ‌చివేత వైఖ‌రి అనుస‌రించ‌డ‌మే కార‌ణ‌మ‌ని మౌర్య ఆరోపించ‌డం బీజేపీకి కాక పుట్టిస్తోంది. యోగి ప్ర‌భుత్వానికి ఎన్నిక‌ల ముందు ఇది ఎంత‌మాత్రం ఊహించ‌ని ఎదురుదెబ్బ కాగా.. జ‌రుగుతున్న ప‌రిణామాలు స‌మాజ్‌వాది పార్టీలో జోష్ ను నింపుతున్నాయి. అయితే మౌర్య స‌మాజ్‌వాదీ పార్టీలో చేరుతున్నార‌న్న వార్త‌ల‌ను ఆయ‌న కుమార్తె ఖండించారు. ఆయ‌న ఏం చేయ‌బోయేదీ త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తార‌న తెలిపారామె. ఇప్ప‌టికే బీజేపీకి.. ఎస్పీ గ‌ట్టి పోటీ ఇవ్వ‌బోతుంద‌ని స‌ర్వేలు చెపుతున్న నేప‌థ్యంలో చాప‌కింద నీరులా అఖిలేష్ యాద‌వ్ గెలుపు కోసం త‌న ప్ర‌య‌త్నాల్లోతాను ఉన్నారని ఈ ప‌రిణామాల‌ను బ‌ట్టి అంచ‌నా వేసుకోవ‌చ్చ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. కాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌పై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వం ఇప్పుడు ఏం చేస్తుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: