కేసీఆర్‌.. తెలంగాణ సాకారం చేసిన నాయకుడు. అసంభవం అన్నదాన్ని సంభవం చేసిన ఘనుడు. అయితే కేసీఆర్ ఆశలు కేవలం తెలంగాణ సీఎం పీఠంతోనే ఆగిపోలేదు.. ఈ దేశానికి నాయకత్వం వహించాలన్నది కేసీఆర్ కల.. అనేక సార్లు ఆయన ఈ కల గురించి మాట్లాడారు. తనకే అవకాశం వస్తే ఈ దేశాన్ని ఎలా మారుస్తారో కూడా చెప్పారు. అయితే.. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడుగా ఆయనకు జాతీయ రాజకీయాల్లో దక్కేది చాలా చిన్న పాత్ర.. 545 సీట్లు ఉన్న భారత లోక్‌సభలో తెలంగాణకు ఉన్నది కేవలం 17 సీట్లు మాత్రమే. ఈ మొత్తం సీట్లు గంపగుత్తగా కేసీఆర్ గెలుచుకున్నా పెద్దగా ఒరిగేదేమీ ఉండదు.


అంటే కేసీఆర్ ఏం చేయాలన్నా జాతీయ స్థాయిలో చేయాలి. అయితే.. ప్రస్తుతం దేశంలో ఒక్క బీజేపీ మాత్రమే జాతీయ పార్టీ హోదాలో ఎక్కువ ఎంపీ సీట్లు ఉన్న పార్టీగా ఉంది. కాంగ్రెస్‌కు కూడా ఎంపీ సీట్లు తగ్గుతూనే ఉన్నాయి. ఇక మిగిలిన సీట్లలో ఎక్కువ ప్రాంతీయ పార్టీలవే. అందుకే కేసీఆర్ తనలాంటి చిన్న పార్టీలను కూడగట్టాలని ఆలోచించారు. అందుకే ఆయన గతంలో ఫెడరల్ ఫ్రంట్ వంటి నినాదాలు ఎన్నుకున్నారు.


గతంలో జోరుగా సాగిన ఈ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు.. ఆ తర్వాత అనూహ్యంగా ఆగిపోయాయి. కేసీఆర్ నైజం అంతే.. ఎందుకో ఇప్పుడు మళ్లీ కేసీఆర్‌కు పాత ఫెడరల్ ఫ్రంట్‌ పాట గురొచ్చినట్టుంది. ఇప్పుడు మళ్లీ ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. మొన్నటికి మొన్న తాను పెద్దగా పట్టించుకోని కమ్యూనిస్టులను ఇంటికి పిలిపించుకుని మాట్లాడారు. ఆ తర్వాత తాజాగా ఆర్జేడీ నాయకులు వచ్చి కేసీఆర్‌ను కలిసి రాజకీయాలు మాట్లాడారు. బీహార్ విపక్ష నేత, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తో కేసీఆర్ భేటీ అయ్యారు. కేంద్రంలో బీజేపీని గద్దె దింపాలని  కోరుకుంటున్న ఇతర పార్టీలతోనూ చర్చించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. మరి ఈ ఫెడరల్ ఫ్రంట్‌ ఎంత దూరం వెళ్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: