ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే రెండున్నర ఏళ్లు దాటేసింది. 151 అసెంబ్లీ స్థానాలతో రికార్డు స్థాయి మెజారిటీ సాధించింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీ. 9 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అధికారంలోకి రావడంతో... చాలా మంది నేతలు అమాత్య పదవులపై ఆశలు పెట్టుకున్నారు. తొలి నుంచి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులుగా గుర్తింపు తెచ్చుకున్న నేతలతో పాటు... వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర... పాదయాత్ర సమయంలో పార్టీలో చేరిన వారు కూడా తమకు మంత్రి పదవులు వస్తాయని ఎంతో ఆరాటపడ్డారు. అయితే అందరికీ సమన్యాయం చేస్తామని తొలి శాసనసభా పక్ష సమావేశంలోనే క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఏర్పాటు అవుతున్న మంత్రివర్గం కేవలం రెండున్నర ఏళ్ల పాటు మాత్రమే ఉంటుందని... ఆ తర్వాత రెండున్నర ఏళ్ల కాలానికి కొత్త వారికి అవకాశం ఇస్తానని జగన్ అప్పట్లో హామీ ఇచ్చారు. ఎవరూ అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదని కూడా భరోసా ఇచ్చారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాటపై నమ్మకంతో... అప్పట్లో రోజా, ధర్మాన ప్రసాదరావు, ఆనం రామనారాయణ రెడ్డి, మల్లాది విష్ణు, ఆళ్ల రామకృష్ణా రెడ్డి వంటి నేతలు సైలెంట్ అయ్యారు. ఇక మంత్రివర్గ మార్పుపై సెప్టెంబర్ 16వ తేదీన నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో జగన్ క్లారిటీ కూడా ఇచ్చారు. ప్రస్తుత మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని... అలాగే కొత్త మంత్రివర్గం కూడా ఎలక్షన్ 2024 టీమ్ అని అభివర్ణించారు జగన్. దీంతో దసరా పండుగకు మంత్రివర్గ కూర్పు ఉంటుందని అంతా భావించారు. ఆ తర్వాత దీపావళి అన్నారు. ఆ తర్వాత శాసన మండలి ఎన్నికల తర్వాత ఉంటుందని సరిపెట్టుకున్నారు. ఇక సంక్రాంతి ముందు ఖాయమని... పెద్ద పండుగకు అందరు తమ అభిమానులతో అమాత్యుల హోదాతో గడిపేయవచ్చని ఆశ పడ్డారు. కానీ ఆ కల కూడా నెరవేరలేదు. ఇప్పుడు తాజాగా ఈ నెల 21వ తేదీన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇదే ఆఖరి సమావేశం అని అంతా భావిస్తున్నారు. ఆ తర్వాత కొత్త మంత్రులతో బడ్జెట్ సమావేశాలకు వెళ్లే అవకాశం ఉంటుందని గంపెడాశలతో ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: