దేశంలో తొలి ఒమిక్రాన్ కేసు వెలుగు చూసిన కర్ణాటక రాష్ట్రంపై ఇప్పుడు కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో కన్నడ రాష్ట్రంలో వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. మొదటి, రెండో దశ కంటే కూడా అత్యంత వేగంగా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు ఇప్పటికే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇక కొత్త కేసులు కూడా రోజు రోజుకూ రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఇక ఒమిక్రాన్ వేరియంట్ దీనికి తోడవ్వటంతో... ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆఫ్రికా దేశాల్లో పుట్టిన ఒమిక్రాన్ వేరియంట్ వల్లే దేశంలో కరోనా వైరస్ మళ్లి విజృంభిస్తోందంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఆంక్షలు అమలు చేస్తున్నారు. 144 సెక్షన్ విధించింది కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ. అలాగే కొవిడ్ నిబంధనలను కూడా తప్పని సరి చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ఈ నెల 18వ తేదీ నుంచి ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలులోకి రానుంది.

కర్ణాటక రాష్ట్రంలో ఒక్కరోజులోనే 14 వేల మంది వైరస్ భారిన పడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కూడా ప్రస్తుతం కొవిడ్ బారిన పడ్డారు. వందల సంఖ్య నుంచి కొత్త కేసుల సంఖ్య వేలు, పది వేల స్థాయికి చేరుకుంది. రాష్ట్రంలో నమోదు అవుతున్న కేసుల్లో 75 శాతం బెంగళూరు నగరంలో ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే నైట్ కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూలను అమలు చేస్తోంది కన్నడ సర్కార్. ఈ ఆంక్షలను ఈ నెల 19వ తేదీన వరకు పొడిగించింది. అలాగే 9వ తరగతి వరకు విద్యార్థులను ఆన్ లైన్ తరగతులకే పరిమితం చేస్తున్నట్లు విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని కోచింగ్ సెంటర్లు, ట్యూషన్ సెంటర్లను లాక్ చేసింది. ఇక షాపింగ్ మాల్స్, మల్టిప్లెక్స్‌లు, సినిమా థియేటర్లు, రెస్టారెంట్లలో కేవలం 50 శాతం వరకే అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. ఇక నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది కర్ణాటక రాష్ట్ర హోమ్ శాఖ. రోజువారీ కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టట్లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కర్ణాటక ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. నైట్ కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూను పొడిగించింది. ఈ నెల చివరి వరకూ నైట్ కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రకటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: