వైసీపీ రెబ‌ల్ ఎంపీ క‌నుమూరు ర‌ఘురామ‌కృష్ణంరాజుకు, వైసీపీ ప్ర‌భుత్వానికి మ‌ధ్య చాలాకాలంగా థ్రిల్ల‌ర్ సినిమాను త‌ల‌పించే స్థాయిలో పోరు సాగుతున్న విష‌యం తెలిసిందే. ఇక తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న న‌ర‌సాపురం లోక్‌స‌భ స్థానానికి రాజీనామా చేసి మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్లి గెలిచి, ప్ర‌జాబ‌లం త‌న‌వైపునే ఉంద‌ని నిరూపిస్తాన‌ని కొద్దిరోజుల క్రితం చెప్ప‌డంతో ర‌ఘురామ ఒక్క‌సారిగా మ‌ళ్లీ వార్త‌ల్లో వ్య‌క్తిగా మారిపోయారు. ఈలోగా తానిచ్చిన స‌మ‌యంలో వైసీపీ త‌నపై అన‌ర్హ‌త వేటు వేయ‌గ‌లిగితే ప్ర‌య‌త్నించ‌వ‌చ్చున‌ని ఆయ‌న ఛాలెంజ్ కూడా విసిరారు. అంతేకాదు అమ‌రావ‌తి ఏకైక రాజ‌ధానిగా ఉండాల‌న్న‌దే త‌న ఎన్నిక‌ల అజెండా అని కూడా ర‌ఘురామ‌రాజు ప్ర‌క‌టించారు. ఈ ప‌రిణామం వైసీపీ ప్ర‌భుత్వం ఎంత‌మాత్రం ఊహించ‌నిదేన‌ని చెప్పాలి. రఘురామ వ్యూహాత్మ‌కంగా వేసిన అడుగు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టేదే. ఎందుకంటే ర‌ఘురామ గెలిస్తే అమ‌రావ‌తికే అనుకూలంగా ప్ర‌జ‌లున్నార‌న్న అంశం స్ప‌ష్టంగా తేలిపోతుంది. అమ‌రావ‌తి కేవ‌లం 29 గ్రామాల‌కు, ఒక సామాజిక వ‌ర్గానికి లేదా రెండు జిల్లాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మన్న ప్ర‌భుత్వ వాద‌న వీగిపోతుంది.

 ర‌ఘురామ‌రాజు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేసుకుని పూర్తి స‌న్న‌ద్ధ‌త‌తోనే రాజీనామా నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు వైసీపీ ప్ర‌భుత్వానికి స్ప‌ష్ట‌మైన స‌మాచారం ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న‌కు పార్టీల‌కు అతీతంగా మ‌ద్ద‌తు ల‌భించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇది ప్ర‌భుత్వానికి ఇబ్బందిక‌ర‌మే. అయితే ఆయ‌న‌ను నిలువ‌రించ‌డ‌మెలాగో వైసీపీ ప్ర‌భుత్వానికి అర్థం కావ‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే ర‌ఘురామ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నట్టు వార్త‌లు వ‌స్తున్న‌ స‌మ‌యంలో బుధ‌వారం ఏపీ సీఐడీ అధికారులు మ‌ళ్లీ నోటీసులిచ్చేందుకు హైద‌రాబాద్‌లోని ర‌ఘురామ‌రాజు ఇంటి త‌లుపులు త‌ట్టారు. ఆయ‌న‌పై గ‌తంలో ఉన్న కేసులకు సంబంధించి విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ సీఐడీ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్న‌ట్టు తెలుస్తోంది. అయితే ర‌ఘురామ బ‌య‌ట‌కు రాక‌పోవ‌డంతో ఆయ‌న లాయ‌ర్ల‌తో సీఐడీ అధికారులు చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు స‌మాచారం. గ‌తంలో మాదిరిగా ఎంపీని బ‌ల‌వంతంగా అరెస్టుకు చేసేందుకు వీలులేదు. ఎందుకంటే ఆవిధంగా సుప్రీంకోర్టు నుంచి స్ప‌ష్ట‌మైన ఆదేశాలున్నాయి. ఏపీ ప్ర‌భుత్వ వైఖ‌రితో ఎంపీ ర‌ఘురామరాజు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తే ఏమ‌వుతుంద‌న్న ఆస‌క్తి ఇప్పుడు స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: