సరిగ్గా 13 ఏళ్ళు వెనక్కి వెళ్ళి ఒకసారి 2009 ఎన్నికల గురించి మాట్లాడుకుంటే..అప్పుడు రెండోసారి అధికారంలోకి రావాలని వైఎస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్ కష్టపడుతుంది. ఇక కాంగ్రెస్‌ని నిలువరించి అధికార పీఠం దక్కించుకోవాలని చెప్పి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ట్రై చేస్తుంది. పైగా టీఆర్ఎస్, కమ్యూనిస్టులని కలుపుకుని కాంగ్రెస్‌కు చెక్ పెట్టాలని బాబు రెడీ అయ్యారు. ఇదే సమయంలో సినిమాల్లో నెంబర్ 1 పొజిషన్‌లో ఉన్న చిరంజీవి ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టి, ఆ ఎన్నికల్లో సత్తా చాటాడానికి రెడీ అయ్యారు.

అయితే అనూహ్యంగా ఎన్నికల్లో కాంగ్రెస్ బొటాబోటి మెజారిటీతో గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ నేతృత్వంలోని మహాకూటమి చివరి దాకా పొరాడి విఫలమైంది. అలాగే ప్రజారాజ్యం కూడా 18 సీట్లు మాత్రమే తెచ్చుకుంది. ఇక ఇక్కడ చిరంజీవి పార్టీకి 18 సీట్లే వచ్చినా...టీడీపీ గెలుపుపై ప్రభావం చూపింది. ప్రజారాజ్యం వల్ల ఓట్లు చీలిపోయి టీడీపీకి చాలా నష్టం జరిగింది. దాని వల్ల కాంగ్రెస్‌కు లాభం జరిగింది. ఈ విషయం టీడీపీ శ్రేణులు ఎవరు మరిచిపోలేదు.

కానీ దీనిపై చంద్రబాబు డైరక్ట్‌గా పెద్దగా స్పందించలేదు. తాజాగా మాత్రం సినిమా టిక్కెట్ల అంశంలో జరుగుతున్న రచ్చపై స్పందిస్తూ...చిరంజీవి తనకు మంచి మిత్రుడు అని, అయినా సరే ఆయన ప్రజారాజ్యం పార్టీ వల్ల 2009 ఎన్నికల్లో అధికారానికి దూరమయ్యామని చెప్పారు. అలా అని ఇప్పుడు చిరంజీవితో విభేదాలు లేవని, ఆయనతో సన్నిహితంగానే ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అలాగే సినిమా వాళ్ళంతా టీడీపీ వాళ్ళు కాదు అని చెప్పడానికి బాబు ఈ ఉదాహరణ చెప్పారు.

అదే సమయంలో చిరంజీవి పేరు చెప్పి పవన్‌కు పరోక్షంగా హింట్ ఇచ్చినట్లు కనిపిస్తున్నారు. ఎలాగో చిరంజీవి వల్ల దెబ్బతిన్నామని, కాబట్టి పవన్ సపోర్ట్ చేస్తే టీడీపీకి బెనిఫిట్, లేదంటే నష్టం అనే కోణాన్ని పరోక్షంగా బయటపెట్టారు. అలాగే ఇద్దరం కలిస్తే వైసీపీని ఎదురుకోవచ్చని హింట్ ఇస్తున్నారు. మొత్తానికైతే పొత్తు కోసం బాబు గట్టిగానే ట్రై చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: