మన ప్రధాని  నరేంద్ర మోదీ గారిపై దేశంలోని కొందరు అవినీతిపరులైన రాజకీయ నాయకులు, 'నల్ల'ధనవంతులు, తీవ్రవాద గ్రూపులు, ఉగ్రవాదులు తదితర దేశద్రోహులందరి కడుపుమంటకి నిజమైన కారణం ఏమిటా? అని విశ్లేషిస్తే... అవినీతి వ్యతిరేక విధానాలపై ఆయన తీసుకున్న ప్రతిష్టాత్మకమైన నిర్ణయాలేనని అర్ధమైంది. డీ-మానిటైజేషన్‌తో పాటు బ్యాంక్ ఖాతాలను ఆధార్‌, PANలతో లింక్ చేయడం వల్ల పన్నుల వసూలు ప్రక్రియను కట్టుదిట్టం చేసి, అక్రమ సంపాదనకు అడ్డుకట్ట వేసేలా ప్రధాని తీసుకున్న ఇటువంటి పలు నిర్ణయాలు ఆయనపై ద్వేషానికి కారణాలని కళ్ళకు కట్టినట్టు అర్దమవుతోందని విజయశాంతి పేర్కొన్నారు.  గతంలో ఒక కొత్త బేస్ (ఆధార్ నంబర్) ని రేషన్ కార్డుకు లింకప్ చేయడం ద్వారా మహారాష్ట్రలో కనీసం 10 లక్షల మంది డూప్లికేట్ కటిక పేదలు అదృశ్యమవగా... ఇదే ఆధార్ లింక్ ద్వారా మరో 30 మిలియన్ల (3 కోట్లు) నకిలీ ఎల్పీజీ కనెక్షన్ ఖాతాదారులు మాయమయ్యిన్రు.. ఇదే ఆధార్ లింక్ ద్వారా మదరసాల నుండి ఉపకార వేతనాలు పొందుతున్న 1,95,000 మంది నకిలీ బాల, బాలికల జాబితా ఎడారి ఎండమావిలా అదృశ్యమైందన్నారు విజయశాంతి. 

"ఈ ఆధార్ లింక్ తో దేశంలోని 1.5 మిలియన్ల (15 లక్షలు) నకిలీ రేషన్ కార్డుదారులు అదృశ్యం కాగా.. PAN - ఆధార్ లింక్‌తో అక్రమ ఆస్తుల, బినామీ కింగ్‌లు, బ్రోకరేజ్ డీలర్లు అందరూ తీవ్ర అసహనంతో ఉన్నారు. అక్రమాలకు అలవాటు పడ్డ బ్రోకర్లు ఆన్‌లైన్ సాధన వ్యవస్థతో తమ గుట్టు రట్టవుతుందని బెంబేలెత్తుతున్నారు. ఇ-టెండర్ ప్రక్రియ ద్వారా చాలామంది కాంట్రాక్టర్ల పప్పులు ఉడకడం లేదు. ఇదే PAN-ఆధార్ లింక్‌తో ఉగ్రవాద ముసుగు సంస్థలకు నిధుల సమీకరణ నిలిచిపోయేలా చేశారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు కూడా పాత ప్రధానమంత్రుల తీరులోనే కళ్ళు, చెవులు మూసుకుని కూర్చుంటారని ఆశపడ్డ రాజకీయ నాయకులు, బ్రోకరేజ్ సంస్థలు, వ్యక్తులు ఆయన తీరుతో తీవ్ర అసంతృప్తికి, మనస్తాపానికి గురై... ప్రాథమిక ఆదాయ నివేదికలకు ఆధార్, PAN కార్డులను జతచేయడం అనేది మా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని సుప్రీంకోర్టులో దావా దాఖలు చేశారు. ఈ చిట్టాలో కొందరు ముఖ్యమంత్రులు కూడా ఉండడం మన ప్రజాస్వామ్యానికి అత్యంత హానికరం. ఈ వ్యతిరేకులందరూ కట్ట కట్టుకుని మరీ మోడీ గారికి వ్యతిరేకంగా ఏకమై, ఒక కూటమిగా ఏర్పడి కిచిడీ పార్టీని ఏర్పాటు చేయడానికి చేతులు కలిపారు. మోడీ గారు ప్రధానిగా మరోసారి గద్దెనెక్కకుండా ఉండాలని... వారు వెతకని దారి లేదు, లేపని రాయి లేదు. అందువల్ల ఇప్పుడు ఈ బాధ్యత 1.25 బిలియన్ల మంది భారతీయులపై పడింది. అవినీతిపరులైన కిచిడి పార్టీలకు మద్దతు ఇవ్వాలా? లేదా ఈ దేశ భవిష్యత్తుకు, అవినీతి అంతానికి, ధర్మానికి కంకణబద్ధుడై ఉన్న మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారా? అనేది నిర్ణయించడం మన చేతుల్లోనే ఉంది." అంటూ విజయశాంతి  వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: