ఏపీలో ప్ర‌భుత్వం, సినీ ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖుల మ‌ధ్య‌ ఇప్ప‌టిదాకా ప‌రోక్షంగా సాగుతూ వ‌స్తున్న పోరు చ‌ల్లారక‌పోగా అంత‌కంత‌కూ ముదురుతున్నట్టే క‌నిపిస్తోంది. ఇక‌పై ఇది ప్ర‌త్య‌క్ష పోరాటంగా మారే సంకేతాలు స్ప‌ష్ట‌మ‌వుతున్నాయి. త‌మ ఇబ్బందులను ఏపీ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక‌పోగా కొంద‌రు హీరోల‌పై ప్ర‌త్యేకంగా ఉన్న వైరం కార‌ణంగా మొత్తంగా ఇండ‌స్ట్రీని దెబ్బ‌తీసే ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌న్న‌ది ప‌రిశ్ర‌మ వర్గాల వాద‌నగా ఉంది. అస‌లే రెండేళ్లుగా కోవిడ్ కార‌ణంగా సినిమాల విడుద‌ల‌, షూటింగ్‌లు ఆగిపోవ‌డంతో అటు నిర్మాతలు భారీగా న‌ష్ట‌పోగా, ఇటు ఇండ‌స్ట్రీపై ఆధార‌ప‌డ్డ నిపుణుల  నుంచి కార్మికుల వ‌ర‌కు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో సినీ ప‌రిశ్ర‌మ‌ను ప్ర‌భుత్వం ఆదుకోవాల్సిందిపోయి మ‌రిన్ని క‌ష్టాలకు గురి చేస్తోంద‌న్న‌ది వారి ఆరోప‌ణ‌. రెండు వ‌ర్గాల మ‌ధ్య వాదోప‌వాదాలు, రాజీ ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న స‌మ‌యంలో వైసీపీ ఎమ్మెల్యే న‌ల్ల‌పురెడ్డి శ్రీనివాసులురెడ్డి సినిమావాళ్లు బ‌లిసి కొట్టుకుంటున్నారంటూ వ్యాఖ్యానించ‌డంతో ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్త‌మవుతోంది.

ఇక వైసీపీ ప్ర‌భుత్వంతో రాజీ ధోర‌ణి కాకుండా తాము కూడా ఎదురు దాడి చేయ‌డ‌మే స‌రైన విధానమ‌ని ఇండ‌స్ట్రీ పెద్ద‌లు భావిస్తున్నారా అంటే అవున‌నే చెప్పాలి. ప్ర‌ముఖ నిర్మాత, ద‌ర్శ‌కుడు ఫిలిం ఛాంబ‌ర్ మాజీ అధ్య‌క్షుడు త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ వైసీపీ నాయ‌కులు బ‌హిరంగా చ‌ర్చ‌కు రావాల‌ని ఇప్ప‌టికే స‌వాల్ విస‌ర‌గా, మ‌రో నిర్మాత‌ ఫిలిం ఛాంబ‌ర్ మాజీ అధ్య‌క్షుడు ఎన్వీ ప్ర‌సాద్.. ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డికి ఘాటుగా కౌంట‌ర్ ఇవ్వ‌డం దీనినే సూచిస్తోంది. బుధ‌వారం తిరుప‌తిలో నిర్వ‌హించిన ప్రెస్‌మీట్‌లో ఎన్వీ ప్ర‌సాద్ మాట్లాడుతూ బ‌లిసికొట్టుకుంటున్న‌ది తాము కాద‌ని అలా మాట్లాడిన వైసీపీ నాయ‌కుల‌కే అది వ‌ర్తిస్తుంద‌ని వ్యాఖ్యానించారు. సినిమాలు తీయ‌డం, వాటిలో న‌టించ‌డంలో ఉన్న క‌ష్టం ఏమిటో తెలియ‌కుండా మాట్లాడుతున్నార‌ని, వంద అడుగులు రోప్ కట్టుకుని కిందికి దూకితే ఎవ‌రు బ‌లిసి కొట్టుకుంటున్నారో తెలుస్తుంద‌ని ఎన్వీ ప్ర‌సాద్ అన్నారు. మీడియా ముందు మాట్లాడితే హీరోలు అయిపోర‌ని గుర్తుంచుకోవాల‌ని, శ్రీనివాసులురెడ్డి రాజ‌కీయ జీవితం గురించి కోవూరులో అంద‌రికీ తెలుస‌ని ఘాటుగా విమ‌ర్శించారు. శ్రీనివాసులురెడ్డి వ్యాఖ్య‌ల‌ను ఇప్ప‌టికే పార్టీలోను, ప్ర‌భుత్వంలోనూ మ‌రికొంత‌మంది నాయ‌కులు స‌మ‌ర్థించిన నేప‌థ్యంలో ఇప్పుడు ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు ఇక అటో ఇటో తేల్చుకోడానికే సిద్ధ‌మైన‌ట్టు వీరి వ్యాఖ్య‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్‌యాద‌వ్ కూడా తాను ఏపీలో థియేట‌ర్ల స‌మ‌స్య‌పై ఆ రాష్ట్ర మంత్రుల‌తో మాట్లాడాతాన‌ని ప్ర‌క‌టించిన‌ట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: