ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటై సరిగ్గా రెండున్నర ఏళ్లు మాత్రమే గడిచింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలను సొంతం చేసుకుని అధికారంలోకి వచ్చింది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 22 స్థానాలను సొంతం చేసుకుంది. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ఏర్పాటై సరిగ్గా రెండున్నర ఏళ్లు పూర్తి చేసుకుంది. అంటే ఇంకా సగం పదవి కాలం మిగిలి ఉంది. కానీ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పటి నుంచే రాష్ట్రాన్ని ఎలక్షన్ మూడ్‌లోకి తీసుకెళ్లాయి. దీంతో నేతలంతా ఇప్పటి నుంచి వారి వారి నియోజకవర్గాల్లో తమ బలం పెంచుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే నియోజకవర్గ ఇంఛార్జ్‌లను టీడీపీ నియమించింది. కానీ పలు చోట్ల మాత్రం గతంలో పోటీ చేసిన ఓడిన వారు మళ్లీ తమకే అవకాశం వస్తుందని ఆరాటపడుతున్నారు. దీంతో ఒక్కో స్థానం కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు.

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ కోసం టీడీపీలో ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం కావడంతో... ప్రస్తుతం వైసీపీ మంత్రి ఆదిమూలపు సురేష్ అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ పడి ఓడిన బూదాల అజితారావు మరోసారి తనకే అవకాశం వస్తుందని బలంగా నమ్ముతున్నారు. అయితే ప్రస్తుతం నియోజకవర్గం ఇంఛార్జ్ బాధ్యతలను గూడూరి ఎరిక్షన్ బాబుకు అప్పగించారు చంద్రబాబు. దీంతో ఎరిక్షన్ బాబు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎక్కడో చెన్నైలో నివసించే అజితా రావు... అప్పుడప్పుడూ చుట్టపు చూపుగా నియోజకవర్గానికి వస్తున్నారు. అంతే తప్ప... కార్యకర్తలకు ఏ మాత్రం అందుబాటులో ఉండటం లేదు. అయితే కొంతమంది బూదాల అజితా రావు అభిమానులు మాత్రం... తమ మేడంకే టికెట్ వస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇందుకు మరో కారణం కూడా. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పిన డాక్టర్ సుధాకర్‌కు అజితా రావు స్వయాన వదిన. దీంతో ఆమె కూడా అంతే ధీమాతో ఉన్నారు. దీంతో ఇప్పుడు నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలు.. తాము ఎవరి కోసం పని చేయాలో అర్థం కాని పరిస్థితి.


మరింత సమాచారం తెలుసుకోండి: