సంక్రాంతి పండుగ అంటే చాలు.. తెలుగు వారికి పెద్ద పండుగ. నిండైన తెలుగుదనంతో పాటు పసందైన పిండివంటలకు సంక్రాంతి పండుగ పెట్టింది పేరు. తెలుగు వారి ఇంట కొత్త అల్లుళ్లు, బంధుమిత్రుల కోలాహలం,  ఆటలు, సంబరాలు... ఆ సందడే వేరు. ఇక సంక్రాంతి పండుగ అంటే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది గోదావరి జిల్లాలు. సంక్రాంతి అంటే మూడు రోజుల పాటు కోలాహలమే. కోడి పందాలు, పేకాట, గుండాట... ఇలా ప్రతి గ్రామంలో కూడా సందడి నెలకొంటుంది. ఇదే సమయంలో కోడిపందాల నిర్వహణపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు కూడా. ప్రతి ఏటా కోడిపందాల సమయంలో ఇదే వివాదం. కోడి పందెంలో ప్రతి ఏటా ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్ల ముందు పోలీసులు ఓడుతూనే ఉన్నారు. చివరికి హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయడంలో విఫలమయ్యారనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అటు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కూడా పోలీసుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

దీంతో ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లో కోడిపందేలు, పేకట, గుండాట నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేసింది. అలాగే కోడి పందేల నిర్వహణను అడ్డుకునేందుకు అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను వినియోగిస్తున్నారు కూడా. డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అలాగే పందేలు నిర్వహిస్తే బైండోవర్ కేసులు పెడతామంటూ ఇప్పటికే హెచ్చరించారు. కొంతమందిని అదుపులోకి కూడా తీసుకున్నారు. కానీ కొన్ని గ్రామాల్లో మాత్రం ఇవేవి లెక్క చేయడం లేదు. తమ గ్రామంలో సంక్రాంతి సంబరాలు జరుగుతాయంటూ బహిరంగంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే కోడి పందాలు, పేకట, గుండం ఆటలతో పాటు మరిన్ని ఆటలు కూడా జరుగుతాయని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పండుగ మూడు రోజులైన 14, 15, 16 తేదీల్లో ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటాయని గ్రాఫిక్ వీడియో తయారు చేసి మరి సోషల్ మీడియాల్లో వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి వీడియోలు కృష్ణా జిల్లాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ సారి పందెంలో పోలీసులు గెలుస్తారా... లేక మళ్లీ ప్రజా ప్రతినిధులే గెలుస్తారో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: