పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొన్నింటి పైనే ఆ ఎంపీ  మనస్సు పడ్డారా..?  మిగిలిన చోట్లకు ఎందుకు వెళ్లడం లేదు..? ఎవరా ఎంపీ..? చిత్తూరు ఎంపీ రెడ్డప్ప. వైసిపి లో భారీ మెజారిటీతో గెలిచి రెండున్నరేళ్లు అవుతున్న ఆయన తీరులో ఎలాంటి మార్పు లేదు అన్నది పార్టీ కేడర్ చెప్పే మాట. చిత్తూరు పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు కాకుండా కేవలం ఒకటి రెండు సెగ్మెంట్ల కే వెళ్తున్నారట. ఎంపీ గా ఉంటే ఢిల్లీ లేదంటే కుప్పం. చిత్తూరు, గంగాధర నెల్లూరు నియోజకవర్గాల్లో కనిపిస్తూ ఉంటారట రెడ్డప్ప. మిగతా చోటుకి వెళ్ళింది, వెళ్తుంది తక్కువే అన్నది క్యాడర్ వాదన. ప్రస్తుతం కుప్పం అంటే  జిల్లా వైసీపీ నేతలకు రెడ్డప్పే గుర్తుకొస్తున్నారట.

 పంచాయతీ పరిషత్,మున్సిపల్ ఎన్నికల్లో కుప్పంలో ఎంపీ రెడ్డప్ప ఒక రేంజ్ లో హడావిడి చేశారు. కుప్పం మీద మనసు పడ్డారో లేక కుప్పంలో వైసీపీ జెండా రెపరెపలాడితే, అధినేత దగ్గర మార్కులు కొట్టేయచ్చని అనుకున్నారో ఏమో రెడ్డప్ప గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నాయి పార్టీ శ్రేణులు. ఇప్పటికీ కుప్పంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా అధికారికమైన, అనధికారికమైన వెంటనే అక్కడకు వాలిపోతున్నారట. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఈ వైఖరి పీక్స్ కు వెళ్లినట్టు వైసిపీ కార్యకర్తల వాదన. రెడ్డప్ప తీరును అనుమానించిందో ఏమో, టీడీపీ కూడా గేర్ మార్చేసింది. కుప్పం వైసిపీ లో అలజడే లక్ష్యంగా ఎంపీ పై సెటైర్లు వేస్తున్నారు తెలుగు  తమ్ముళ్లు. వచ్చే ఎన్నికల్లో కుప్పం లేదా గంగాధర నెల్లూరు నుంచి పోటీ చేసే ఆలోచనలో రెడ్డప్ప ఉన్నారని ప్రచారం మొదలు పెట్టేసారు. ఈ వాదనను అధికార పార్టీ వర్గాలు కొట్టిపాడేస్తున్న ఎంపీ తీరు మాత్రం అనుమానంగానే ఉందని చెబుతున్నారు.

ఎంపీ తో పనుండి జనాలు వస్తే చిక్కడు దొరకడు అనే విమర్శ వైసిపి లోనే ఉందట. ఎప్పుడు ఒక వైపే చూడకుండా లోక్ సభ పరిధిలోని అన్ని సెగ్మెంట్ల పై ఫోకస్ పెట్టాలన్నది వైసీపీలో కొందరి అభిప్రాయం. అయితే ఈ విషయాన్ని ఎంపీ రెడ్డప్ప కు చెప్పే సాహసం ఎవ్వరూ చేయడం లేదట. రాజకీయాలతో పాటు అభివృద్ధి పనుల పైన కాస్త దృష్టి పెడితే మంచిదన్నది వారి హితోక్తి. అయితే ఎంపీ అనుకూల వర్గం అభిప్రాయం మరోలా ఉంది. లోక్ సభ పరిధిలోని అన్ని సెగ్మెంట్లకు ఎంపీ వెళ్తున్నారని, అనారోగ్య సమస్యల వల్లే కొంత విరామం ఇచ్చారని చెబుతున్నారు. కానీ కుప్పం,చిత్తూరు,గంగాధర నెల్లూరుపై రెడ్డప్ప ఎక్కువ ఫోకస్ పెట్టడం వెనుక  ఇంకేదో కథ ఉందని చెవులు కొరుక్కుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: