యూపీలో అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ఆ రాష్ట్ర మంత్రిగా ఉన్న‌ స్వామి ప్ర‌సాద్ మౌర్య త‌న మంత్రి ప‌ద‌వికి, పార్టీకి రాజీనామా చేసి  బీజేపీకి షాక్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఆయన వెంట మ‌రో న‌లుగురు ఎమ్మెల్యేలు బీజేపీని వీడుతున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డం, బుధ‌వారం మ‌రో మంత్రి దారాసింగ్ చౌహాన్ కూడా పార్టీని వీడ‌టం, ఆ బాట‌లోనే మ‌రికొంద‌రు న‌డిచే అవ‌కాశం ఉంద‌న్న వార్త‌లు ఆ రాష్ట్ర రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నాయి. ఈ ప‌రిణామాల‌తో ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్‌కు గుక్క తిప్పుకోలేని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని చెప్పాలి. ఇదిలా ఉండ‌గా రాజీనామా చేసిన కొద్ది గంట‌ల వ్య‌వ‌ధిలోనే స్వామిప్ర‌సాద్ మౌర్య‌పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. గ‌తంలో బీఎస్పీ నేత‌గా ఉన్న స‌మ‌యంలో మౌర్య హిందూ దేవత‌ల‌కు సంబంధించి విద్వేష‌పూరిత వ్యాఖ్య‌లు చేశారంటూ 2014లో ఆయ‌న‌పై కేసు న‌మోదైంది. ఈ కేసులో ఈ నెల 24వ తేదీలోగా విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ సుల్తాన్‌పూర్ ఎంపీ-ఎమ్మెల్యే ప్ర‌త్యేక కోర్టు బుధ‌వారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో యూపీలో బీజేపీ మార్కు రాజ‌కీయం మొద‌లైంద‌న్న విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి.

బీసీ సామాజిక‌వర్గానికి చెందిన మౌర్య రాజీనామా చేసి స‌మాజ్ వాదీ పార్టీలో చేరాల‌ని నిర్ణ‌యించుకున్న విష‌యం తెలిసిందే. మౌర్య కుమార్తె సంఘ‌మిత్ర బ‌దౌన్ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. మౌర్య ప్ర‌భావం దాదాపు 25 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉంటుంద‌న్న అంచనాల‌తో బీజేపీలో క‌ల‌వ‌రం మొద‌లైంది. అయితే బీజేపీని వీడాల‌న్న త‌న నిర్ణ‌యం మార్చుకునేది లేద‌ని ఆయ‌న ఇప్ప‌టికే స్ప‌ష్టంగా ప్ర‌క‌టించారు. ఆయ‌న ఈ నెల 14న అఖిలేష్ యాద‌వ్ స‌మ‌క్షంలో ఎస్పీ తీర్థం పుచ్చుకోనున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. కాగా ఇదే స‌మ‌యంలో స్వామిప్ర‌సాద్ మౌర్య‌పై పాత కేసులో స‌మ‌న్లు రావ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. త‌న రాజీనామాతో బీజేపీలో భూకంపం మొద‌లైన‌ట్టేన‌ని మౌర్య వ్యాఖ్యానించారు. 2017 ఎన్నిక‌ల్లో 312 సీట్లు గెలుచుకుని తిరుగులేని విజ‌యం సాధించిన బీజేపీ బ‌లం ఈ ఎన్నిక‌ల‌నాటికి గ‌ణ‌నీయంగా త‌గ్గిపోయింద‌ని, స‌మాజ్‌వాదీ పార్టీతో హోరాహోరీ పోరు త‌ప్ప‌ద‌ని ఇటీవ‌ల వ‌చ్చిన స‌ర్వేలు తేల్చి చెపుతున్న నేప‌థ్యంలో తాజా ప‌రిణామాలు బీజేపీలో ఆందోళ‌న‌ను, ఇత‌ర రాజ‌కీయ ప‌క్షాల్లో ఉత్కంఠ‌ను రేకెత్తిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: