దేశంలో క‌రోనా మూడోవేవ్ విస్త‌రిస్తున్న విష‌యం తెలిసిందే. వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ప్ర‌భుత్వ ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇప్ప‌టికే మెట్రో న‌గ‌రాల్లో రాత్రిపూట క‌ర్ఫ్యూ అమ‌లు చేస్తుండ‌గా, జ‌నాలు గుమిగూడే ఫంక్ష‌న్ల‌పై నియంత్ర‌ణ ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. అయితే వైర‌స్ నియంత్ర‌ణ‌కు అవి ఏమాత్రం స‌రిపోవ‌డంలేద‌ని నిత్యం పెద్ద సంఖ్య‌లో కొత్తగా న‌మోద‌వుతున్న కేసుల సంఖ్య చెపుతోంది. అయితే రెండో వేవ్ నాటితో పోలిస్తే ఇప్పుడు చాలామందికి వ్యాక్సినేష‌న్ జ‌రిగింది కాబ‌ట్టి ప్రాణాపాయం ఉండ‌క‌పోవ‌చ్చ‌ని,  వైర‌స్ కార‌ణంగా మ‌ర‌ణాల సంఖ్య పెద్ద‌గా ఉండ‌క‌పోవ‌చ్చ‌న్న‌ది ఇప్ప‌టిదాకా  అంద‌రూ న‌మ్ముతూ వ‌చ్చిన విష‌యం. వైద్య ఆరోగ్య వ‌ర్గాలు కూడా ఇదే అంశాన్నిచెపుతూ వ‌చ్చాయి. కానీ ప‌రిస్థితి దీనికి భిన్నంగానే క‌నిపిస్తోంది. కేసుల‌తో పాటు మ‌ర‌ణాల సంఖ్య కూడా పెరుగుతోంది.
 
కేర‌ళ‌లో బుధ‌వారం ఒక్క‌రోజే 12 వేల‌కు పైగా కొత్త కేసులు రాగా, 199 మంది చ‌నిపోవ‌డం మూడో వేవ్ ముప్పు తీవ్ర‌త‌ను సూచిస్తోంది. దేశ రాజ‌ధాని ఢిల్లీ న‌గ‌రంలో గ‌డ‌చిన 24 గంట‌ల్లో 27 వేల కొత్త కేసులు న‌మోదు కాగా 40 మంది ప్రాణాలు కోల్పోయారు.  మ‌హారాష్ట్ర‌లో ఒక్క‌రోజు వ్య‌వ‌ధిలో 46,723 కేసులు రావ‌డంతో అక్క‌డ మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 2.4 ల‌క్ష‌ల‌కు చేరుకుంది. కేవ‌లం వారం కంటే త‌క్కువ వ్య‌వ‌ధిలోనే వేల‌నుంచి ల‌క్ష‌ల్లోకి ఈ సంఖ్య చేరుకోవ‌డం గ‌మ‌నార్హం. కోవిడ్ కార‌ణంగా ఇక్క‌డ గ‌డ‌చిన 24 గంట‌ల్లో 32 మంది చ‌నిపోయారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనే నాలుగైదు రోజులుగా కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ప‌రిస్థితిని కేంద్రం నిశితంగా గ‌మ‌నిస్తోంది. గురువారం సాయంత్రం 4.30 గంట‌ల‌కు ప్ర‌ధాని న‌రేంద్రమోదీ అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి  ప‌రిస్థితి తీవ్ర‌త‌ను, రాష్ట్రాలు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను స‌మీక్షించ‌నున్నారు. ప‌రిస్థితి అదుపు త‌ప్ప‌కుండా కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతున్న ప్రాంతాల్లో పాక్షిక లాక్ డౌన్ విధించే అవ‌కాశం పైనా చ‌ర్చించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: